పవన్ కల్యాణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అందులో `హరి హర వీరమల్లు` ఒకటి. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. `భీమ్లా నాయక్` కోసం `వీరమల్లు`ని తాత్కాలికంగా పక్కన పెట్టాడు పవన్. క్రిష్కూడా ఏం ఖాళీగా కూర్చోలేదు. ఈలోగా `కొండపొలం` సినిమాని పూర్తి చేసేశాడు. ఇప్పుడు మళ్లీ `వీరమల్లు` పనిలో బిజీ అయ్యాడు. దసరా తరవాత `వీరమల్లు` రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నదని సమాచారం. ఈలోగా `భీమ్లా నాయక్` షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. `భీమ్లా నాయక్`ని పవన్ ఎలా ఏకధాటిగా పూర్తి చేశాడో.. అలానే `వీరమల్లు`ని సైతం పూర్తి చేయాలని చూస్తున్నాడట. `హరి హర వీరమల్లు` ఫస్టాఫ్ దాదాపుగా పూర్తయిపోయిందని, మరో 5 రోజులు షూటింగ్ చేస్తే… తొలి సగం ఫినిష్ అవుతుందని తెలుస్తోంది.
క్రిష్ సినిమాలు సాధారణంగా సున్నితమైన పాయింట్ తో తెరకెక్కుతాయి. కాబట్టి మేకింగ్ విషయంలో పెద్దగా జాప్యం జరగదు. కానీ `వీరమల్లు` సెటప్ అలా లేదు. యాక్షన్ సీన్లకు ప్రాధాన్యం ఎక్కువ. పైగా భారీ సెట్టింగులు అవసరం. ద్వితీయార్థంలో యాక్షన్ హంగామా ఎక్కువగా కనిపించబోతోందట. అందుకే… ఆయా సన్నివేశాల కోసం క్రిష్ కాస్త ఎక్కువగానే సమయం తీసుకునే అవకాశం ఉంది. ఎలాగైనా సరే.. 2021 చివరి నాటికి `వీరమల్లు` షూటింగ్ పూర్తి చేయాలన్నది క్రిష్ ఆలోచన. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.