హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ‘లష్’ అనే కాస్మెటిక్ తయారీసంస్థ పేరుమోసిన అడవిదొంగ వీరప్పన్ పేరుతో ఒక సబ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. పెర్ఫ్యూమ్స్, బాడీ స్ప్రే, మీసాల వేక్స్ తదితర కాస్మెటిక్స్‌ను ‘స్మగ్లర్స్ సోల్’ పేరుతో సబ్ బ్రాండ్‌గా విడుదల చేసింది. ఆ బాటిల్స్ అన్నింటిపై వీరప్పన్ బొమ్మ ఉంటుంది. ‘ఇన్టాక్సికేటింగ్ అండ్ డేంజరస్’ అనే టేగ్ లైన్ పెట్టారు. ఈ పెర్ఫ్యూమ్స్లో ఇండియాకు చెందిన గంధపుచెక్క, సుగంధ తైలాలను వాడారు. వెస్ట్‌లో విరివిగా ఉపయోగించే పెర్ఫ్యూమ్స్, ఇతర పరిమళ ద్రవ్యాల వెనక జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్, అక్రమ వ్యవహారాలను ఎత్తిచూపటంకోసమే స్మగ్లర్స్ సోల్ అనే పేరు పెట్టినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, ఇలా వీరప్పన్ పేరుతో కాస్మెటిక్స్ తయారు చేయటంపై లష్ సంస్థ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక అడవిదొంగ పేరును కాస్మెటిక్స్‌కు పెట్టటమేమిటి అని లష్ సంస్థ వెబ్ సైట్లో కొందరు కామెంట్స్ పెట్టారు. సంస్థ యాజమాన్యానికి వీరప్పన్ గురించి తెలియకపోయిఉండొచ్చని, అతను ఒక బందిపోటు, అడవిదొంగ అని వ్యాఖ్యానించారు. ఇకనుంచి లష్ ఉత్పత్తులను తాము కొనుగోలు చేయబోమని పేర్కొన్నారు. పిటిషన్సైట్.కామ్ అనే వెబ్ సైట్లో లష్ సంస్థ వీరప్పన్ పేరు పెట్టటానికి వ్యతిరేకంగా కొందరు ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే ‘గ్లోబల్ మార్చ్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ రైనోస్’ సంస్థ కూడా లష్ సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియా సైట్లలో క్యాంపెయిన్ మొదలుపెట్టింది.
గంధపుచెట్ల దొంగ వీరప్పన్ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అడవులలో కొన్ని సంవత్సరాలపాటు భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నాటి కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి రు.100 కోట్లు వసూలు చేసిన వీరప్పన్ చివరికి 2004లో హతమయ్యాడు. వీరప్పన్ జీవితంపై రాంగోపాల్ వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ చిత్రం విడుదలకు సిద్ధమయింది. ఇక లష్ విషయానికొస్తే, ఈ సంస్థ బ్రిటన్‌లో 20 ఏళ్ళనుంచి ఉంది. బ్రిటన్‌లో, 48 ఇతర దేశాలలో దీనికి 900 స్టోర్స్ ఉన్నాయి. ఈ సంస్థ ప్రధానంగా చేతులతో తయారుచేసిన సబ్బులను, ఇతర కాస్మెటిక్స్‌ను అమ్ముతూ ఉంటుంది. లష్ సంస్థ ఉత్పత్తులలో ఇండియా పేరుతో మరో పెర్ఫ్యూమ్ కూడా ఉంది. దీనిపేరు ‘సిక్కిమ్ గాళ్స్’.