కిల్లర్ వీరప్పన్ అంటే.. ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆ వీరప్పన్ కుమార్తె ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చి.. యూత్ పదవి కూడా ఇచ్చేసింది. తమిళనాడు బీజేపీ యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమెకు పదవి ఖరారు చేసింది. వీరప్పన్ కుమార్తె.. బాగా చదువుకు లాయర్ అయ్యారు. ప్రాక్టిస్ కూడా చేస్తున్నారు. రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుని బీజేపీని ఎంచుకున్నారు. బీజేపీ నేతలు కూడా.. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. చేరిన నాలుగైదు నెలల్లోనే కీలకమైనపదవి కూడా కట్ట బెట్టేశారు.
వీరప్పన్ బయటకు విలన్ గా పేరు తెచ్చుకుని ఉండవచ్చు కానీ.. ఆయన తమిళనాడులో వీరాభిమానులు ఉన్నారు. ఆయనకంటూ సొంత వర్గం ఉంది. వీరంతా ఉపయోగపడతారని బీజేపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. డీఎంకే.. అన్నాడీఎంకే మధ్య చీలిపోయిన ఓటర్ల నుంచి ఓ వర్గాన్ని ఆయినా ఆకర్షించాలని బీజే్పీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే రెండింటికి హిందూత్వ వాదం దూరమే. ఈ క్రమంలో.. అదే వాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నా.. సరైన నాయకత్వం లేక.. వెనుకబడిపోతోంది.
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. సమయం దగ్గర పడుతూండటంతో.. రాజకీయ పార్టీలు.. మెల్లగా సన్నాహాలు ప్రారంభించుకుంటున్నాయి. ప్రస్తుతానికి బీజేపీకి అక్కడ బేస్ లేదు. రజనీకాంత్ లాంటి వాళ్లు.. వచ్చి పునాదులు లేపుతారేమోనని ఆశ పడుతున్నారు కానీ.. ఆయన ఎటూ చెప్పడం లేదు. దీంతో.. అంతో ఇంతో.. జనంలో గుర్తింపు ఉన్న వారిని నేతలుగా తయారు చేయాలని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. వీరప్పన్ కుమార్తె కు కూడా రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.