యేడాదికి ఎన్ని సినిమాలు చేశాం, ఎంత సంపాదించాం? అనే లెక్కలు కీలకమైనవే. కెరీర్ ఎలా ఉన్నా, సెటిలైపోయేందుకు ఆస్కారం ఉంటుంది. రెండేళ్లు గ్యాప్ లేకుండా సినిమాలు తీసుకొంటూ వెళ్తే.. ఆ తరవాత కొన్నాళ్లు సినిమాల్లేకపోయినా తట్టుకోవొచ్చు. టైమ్ ఈజ్ మనీ అనుకొంటున్న తరుణంలో రెండున్నరేళ్లు సినిమాలే తీయకుండా ఖాళీగా కూర్చోవడం నిజంగా ఆత్మహత్యా సదృశ్యమే. వీరూ పోట్ల విషయంలో అదే జరిగింది. రచయితగా తనకంటూ ఓ పేరు తెచ్చుకొని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్షన్లోకి దూకేశాడు వీరూపోట్ల. తొలి సినిమా బిందాస్ ఓకే అనిపించింది. రగడ కూడా మరీ ఘోరమైన సినిమా ఏం కాదు. దూసుకెళ్తా ఓ మాదిరిగా ఆడింది. అక్కడ్నుంచి రెండున్నరేళ్లు సినిమా లేకుండా ఖాళీగా కూర్చోవాల్సివచ్చింది. ఈలోగా రవితేజ, వెంకటేష్‌లతో ఓ మల్టీస్టారర్ తీద్దామని వాళ్ల చుట్టూ తిరిగాడు. ఈ సినిమాలోనటించడానికి వెంకీ ఓకే అన్నాడు కూడా. అయితే రవితేజ నుంచి ఎప్పటికీ గ్రీన్ సిగ్నల్ రాకపోయే సరికి…రెండేళ్లు అక్కడే గడిచిపోయాయి. ‘చేస్తాను..’, అని గానీ ‘చేయను’ అనిగానీ ఆ హీరోలిద్దరూ క్లారిటీగా చెప్పకపోవడం వల్ల రెండేళ్లు వాళ్ల ఆఫీసుల చుట్టూ తిరగడానికే సరిపోయిందట. ఇదే విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోతున్నాడు వీరూపోట్ల.
ఈడు గోల్డ్ ఎహే సినిమా పట్టాలెక్కడానికి ముందు రోజు కూడా వీరూ పోట్ల విశ్వ ప్రయత్నం చేశాడట. ‘చేస్తారా, చేయరా? ఏదో ఒకటి చెప్పేయండి’ అంటూ కాస్త గట్టిగా అడగడంతో చివరికి ‘నో’ చెప్పారట. దాంతో చేసేదేం లేక వీరూపోట్ల సునీల్ తో ఎడ్జస్ట్ అయినట్టు టాక్. అయితే ఆ హీరోల వల్లే తన కెరీర్ ఇలా స్థబ్దుగా మారిపోయిందని, మూడేళ్ల విరామం రావడానికి వాళ్లే కారణమని సన్నిహితులతో చెబుతున్నాడట వీరూపోట్ల. పరిశ్రమలో ఇవన్నీ సహజమని.. పెద్ద హీరోల విషయంలో కాస్త ఆచితూచి స్పందించడం ముఖ్యమని సన్నిహితులు సలహా ఇస్తున్నారిప్పుడు. అంతకంటే చేసేదేముంది??