అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ పత్రికకు ఆర్టికల్ రాసినందుకు ఓవీ రమణ అనే సీనియర్ నేతను సస్పెండ్ చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ.. తాజాగా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణకూ అదే ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆయన చేసిన తప్పేమిటంటే.. రాజధాని గ్రామాల్లో రైతుల చేస్తున్న దీక్షలకు హాజరవడం. అక్కడ తాను బీజేపీలో ఉన్నప్పటికీ.. రైతులకు మద్దతుగా నిలబడలేకపోతున్నందుకు.. తనను తాను శిక్షించుకోవడం.
రైతులకు అండగా ఉండలేకపోతున్నామని వెలగపూడి గోపాలకృష్ణ తన చెప్పుతో తాను కొట్టుకున్నారు. రాజధానికి 34 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు ..బీజేపీ ఆదుకుంటుందని రైతులు భరోసా పెట్టుకున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వెలగపూడి గోపాలకృష్ణ పార్టీ కార్యాలయం కోసం గతంలో స్థలం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయనను సస్పెండ్ చేస్తూ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి మద్దతుగా మాట్లాడితే.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లేనన్నట్లుగా ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల చేశారు.
వెలగపూడి గోపాలకృష్ణ పార్టీ పార్టీ అభిప్రాయానికి భిన్నంగా ప్రకటనలు చేశారని.. బీజేపీ రైతుల పక్షాన నిలబడటం లేదని చెప్పడం సరి కాదని.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేస్తున్నామని ప్రకటనలో చెప్పుకొచ్చింది. అమరావతికి మద్దతుగా మాట్లాడే ప్రతి ఒక్కరి నోళ్లు మూయించే దిశగా.. బీజేపీ కొత్త నాయకత్వం పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పైకి మాత్రం.. అమరావతి రైతులకు అండగా పోరాడతామని ప్రకటనలుచేస్తున్నారు. కార్యాచరణలోకి దిగిన వారిపై మాత్రం సస్పెన్షన్ వేటు వేస్తున్నారు.