వైసీపీలో బాగా నోరున్న నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈ మూడేళ్లలో మూటగట్టుకున్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు. ఆయన తీరు వల్ల సామాన్య ప్రజలు మాత్రమే కాదు సొంత పార్టీ నేతలు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలో 22 మంది కార్పొరేటర్లు ఉంటే.. నలుగురు, ఐదుగురు తప్ప అందరూ ప్రస్తుతం వెల్లంపల్లితో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. విచిత్రం ఏమిటంటే.. వీరందరికీ వెల్లంపల్లినే టిక్కెట్లు ఇప్పించారు. తాను పదవులు ఇప్పించిన వారు కూడా తనను లెక్క చేయడం లేదు.
బెజవాడ కార్పొరేషన్లో గెలుపు వెల్లంపల్లి కృషేనని ఆయన చెప్పినట్లుగా మేయర్ పదవిని నగరాల సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి అప్పగించారు. ఇక దుర్గగుడి ఛైర్మన్ పదవి కూడ నగరాల సామాజిక వర్గానికి చెందిన పైలా సోమినాయుడు కు ఇప్పించారు. అయితే ఇప్పడు వెలంపల్లి మాజీ అయ్యారు..దీంతో పరిస్దితులు ఒక్క సారిగా మారిపోయాయి.ఆయన సొంత నియోజకవర్గంలోని మేయర్ భాగ్యలక్ష్మి,తో పాటుగా ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అసంతృప్తితో వెలంపల్లికి దూరంగా ఉంటున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో వెలంపల్లి అన్ని తానే అయ్యి వ్యవహరించారని,ఇప్పుడు కూడ ఆయన అదే పై చేయి కోసం ప్రయత్నించటంతో మేయర్ అసంతృఫ్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక దుర్గగుడి ఛైర్మన్ సొమినాయుడు రెండు సంవత్సరాలు పని చేశారు. ఆ సమయంలో కరోనా తో కాలం గడిచిపోయింది.దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే మరో సారి అవకాశం ఇవ్వాలని అడిగితే పార్టి నిబందనలు ఓప్పుకోవన్నారట..దీంతో ఆయన వర్గం కూడా అసంతృఫ్తిగా ఉంది.
ఈ విభేదాలు ముదిరి ఇప్పుడు కొంత మంది కార్పొరేటర్లు రాజీనామాల బాట పట్టారు. మరో వైపు మంత్రి పదవి నుంచి తొలగించినందున అసంతృప్తికి గురి కాకుండా ఆయనకు జగన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఓ వైపు జిల్లో మంత్రులు.. మంత్రుల స్థాయి నేతలు ఉన్నారు. వారందర్నీ సమన్వయం చేసుకోవడమే కష్టం అనుకుంటే.. తన నియోజకవర్గంలో పరిస్థితులు దిగజారిపోవడం ఆయనను మరింత ఇబ్బంది పెడుతోంది.
అన్నింటికీ మంచి వెల్లంపల్లి పనితీరుపై సామాన్య ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మూడేళ్ల నుంచి కాలనీల్లో చిన్న అభివృద్ధి పని జరగలేదు. కానీ వెల్లంపల్లి అవినీతిపై మాత్రం నియోజకవర్గంలో విస్తృత చర్చ జరుగుతోంది. దేవాదాయ మంత్రిగా ఆయన తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీంతో ఆయన పరిస్థితి నియోజకవర్గంలో దారుణంగా దిగజారింది.
పశ్చిమ నియోజకవర్గంలో జలీల్ ఖాన్‌తో పాటు టీడీపీ క్యాడర్ కూడా బలంగా ఉంది. జనసేనలో తన నియోజకవర్గంలో యాక్టివ్‌గా పని చేసే నేతల్లో ఒకరు అయిన పోతిన మహేష్ సీరియస్‌గా వెల్లంపల్లిపై పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు పధ్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. 58 వేల ఓట్లు వెల్లంపల్లికి వస్తే.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జలీల్ ఖాన్ కుమార్తెకు యాభై వేల ఓట్లు వచ్చాయి. పోతిన మహేష్ ఇరవై రెండు వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సారి వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత ఉండటం… పొత్తు పరిణామాలు… మాజీ మంత్రికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వెల్లంపల్లిని మార్చి ఇతరులకు టిక్కెట్ ఇచ్చినా వైసీపీకి అనుకూలంగా ఓటర్లు మారని పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.