దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లుగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దేవాదాయ మంత్రి వెల్లంపల్లి .. కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని… జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే వరకూ వారం రోజుల పాటు.. అక్కడే గడిపి వచ్చిన తర్వాత ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజుల చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు.
వెంటనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యా కానుక పథకం లో భాగంగా విద్యార్థులకు బ్యాగులు ఇచ్చే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అప్పుడే.. ఇతర పార్టీల నేతలు విమర్శలు చేశారు. మంత్రి వెల్లంపల్లి ఉచిత కరోనా పథకం పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే వెల్లంపల్లి అలాంటివేమీ పట్టించుకోలేదు. దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున పట్టువస్త్రాలు సమర్పించేందుకు రావాలంటూ.. ఆయన ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు రెండు రోజుల కిందట కలిశారు. ఆ తర్వతా ఆయనకు ఆనారోగ్యం తిరగబెట్టింది.
బుధవారం మధ్యం హఠాత్తుగా ఆయనకు శ్వాస సమస్యలు రావడంతో.. ఆయనకు కరోనా చికిత్స అందించిన వైద్యుడు వచ్చి పరీక్షించారు. పరిస్థితి సీరియస్గా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించడంతో.. అధికారులు అప్పటికప్పుడు సీఎంవోను సంప్రదించారు. ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఉంచే ప్రత్యేక విమానాన్ని.. అప్పటికప్పుడు సిద్ధం చేసి.. హైదరాబాద్కు తరలించారు. అపోలో లో చేర్పించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.