ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతల అసహనం వారికి తెలియకుండానే బయటకు వచ్చేస్తోంది. ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని కేసులు…దాడులు.. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మీడియా గగ్గోలు పెడుతోంది. అయితే.. వీటన్నింటి కంటే భిన్నంగా.. దేవాదాయ మంత్రి.. తనదైన పద్దతిలో.. ప్రతిపక్షాలు, మీడియా మూసివేతకు ఓ పని సంకల్పించారు. అదేమిటంటే.. దేవుడ్ని వేడుకోవడం. ఇటీవల కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురై.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లి.. చికిత్స పొంది కోలుకున్న వెల్లంపల్లి ఇప్పుడిప్పుడే…సాధారణ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
దేవాదాయ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి … ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని, పత్రిక, ఛానల్స్‌ను మూసేయాలని స్వామి వారిని వేడుకున్నానని చెప్పుకొచ్చారు. దీనికి కారణం స్వరూపానందకు ప్రత్యేక పూజలు చేయాలని.. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు రావడమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందూ ధర్మం కాపాడే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని… స్వరూపానంద గురించి వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు ఆయన ఆశీర్వాదం తీసుకోలేదా అని లాజిక్ కూడా లాగారు.
ఎవరికైనా స్వరూపానందపై భక్తి ఉంటే.. వ్యక్తిగతంగా చూపించుకుంటే.. ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ.. భక్తుల మనోభావాలు.. దేవుళ్ల సొమ్ము పెట్టి.. ఆయనకు మర్యాదలు చేస్తేనే విమర్శలు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వంపై అలాంటి విమర్శలు వస్తున్నాయి. అయినా స్వరూపానందకు ప్రత్యేక పూజల విషయంలో అడ్డగోలుగా సమర్థించుకుంటున్న ప్రభుత్వం… ప్రతిపక్షాలు, మీడియా మూసేయాలని.. దేవుడ్ని ప్రార్థిస్తోంది. ప్రభుత్వ పెద్దల తీరు అంతే అనుకోవడమే తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి ఏపీలో ఉంది.