తమిళనాడులో ఏ ఎన్నికలు జరిగినా… డబ్బుల విపరీతంగా పట్టుబడిన కారణంగా.. ఒకటో, రెండో చోట్ల ఎన్నికలు వాయిదా పడటం.. ఇటీవలి కాలంలో సంప్రదాయంగా మారుతోంది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల విషయంలోనూ.. అదే జరగబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వెల్లూరు లోక్‌సభ స్థానం తరపున డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కతిర్ ఆనంద్‌కు చెందిన ఇళ్లలు, గోడౌన్లలోసోదాలు చేసిన… ఐటీ అధికారులు… దాదాపుగా రూ. 11 కోట్ల 53 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ.. ఎన్నికల్లో పంచడానికే సేకరించి పెట్టారని ఐటీ అధికారులు నివేదికను… ఎన్నికల సంఘానికి పంపారు. ఈ నివేదిక ఆధారంగా.. వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేయాలనే నిర్ణయానికి .. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చినట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా దీనిపై ప్రకటన రావొచ్చంటున్నారు.
నిజానికి… వెల్లూరు డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ తండ్రి.. డీఎంకే కోశాధికారి. ఆయనపై ఐటీ దాడులు చేయడానికన్నా మూడు రోజుల ముందే.. అన్నాడీఎంకేకు చెందిన నేతల ఇళ్లపై దాడులు చేశారు. ఓ మంత్రి సన్నిహితుడి ఇంట్లో రూ. 15 కోట్ల నగదు లభ్యమయింది. దానికి పెద్దగా ప్రచారం కల్పించని ఐటీ అధికారులు.. డీఎంకే నేత ఇంట్లో దొరికిన మనీని వీడియో తీసి మరీ మీడియాకు ఇచ్చారు. ఇది తమిళనాడులో తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు.. ఆ మనీ పట్టుబడిన లోక్‌సభ నియోజకవర్గం నుంచి పట్టించుకోకుండా.. ఒక్క వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం విషయంలో మాత్రమే ముందడుగు వేస్తున్నారు.
నిజానికి… విపరీతంగా డబ్బులు పట్టుబడటంతో.. తమిళనాడులో ఎన్నికలు వాయిదాపడటం ఇటీవలి కాలంలో కామన్‌గా మారింది. జయలలిత బతికి ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తంజావురు, అరవకుర్చి అసెంబ్లీ స్థానాల ఎన్నిక ఇలాగే వాయిదా పడింది. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుబడటంతో.. ఓటర్లను కొంటున్నారని చెప్పి వాయిదా వేశారు. జయలలిత మరణించిన తర్వాత .. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే నగర్ స్థానంలో జరిగిన ఉపఎన్నికల సమయంలో.. కూడా భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని చెబుతూ.. సుదీర్ఘ కాలం వాయిదా వేశారు. తర్వాత నిర్వహించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి వెల్లూరు వచ్చి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.