ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఆయనకు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇతరుల సంగతేమో కానీ వేం నరేందర్ రెడ్డికి సీటు కేటాయించడం మాత్రం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈగోను హర్ట్ చేయడమేనని రేవంత్ క్యాంపు భావిస్తోంది. ఎందుకంటే దానికో చారిత్రక నేపధ్యముంది.
రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికించడానికి స్టీఫెన్సన్ ను ప్రయోగించి.. ఆయన ఇంట్లో ఇరవై యాంగిల్స్ లో కెమెరాలు పెట్టి ట్రాప్ చేసిన వ్యవహారం జరిగింది వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కాకుండా ఉండటానికే. అప్పట్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీకి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. కానీ బీఆర్ఎస్ కొంత మందిని ఆకర్షించింది. దాంతో వేం గెలవడం కష్టంగా మారింది. వారు లేకపోతే తాను ఓటు వేస్తానని ముత్తయ్య అనే పాస్టర్ ద్వారా స్టీఫెన్సన్ టీడీపీ వర్గాలతో బేరం పెట్టారు. ఆయనతో మాట్లాడేందుకు వెళ్లిన సమయంలో ట్రాప్ చేశారని రేవంత్ క్యాంపు ఆరోపిస్తోంది.
అప్పుడు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవకపోగా కేసుల పాలయ్యారు. ఇప్పుడు అదే వేం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల సపోర్టుతోనే ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉండే పొలిటికల్ హై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు రేవంత్ అదే పనిలో ఉన్నారు. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసిన మరుక్షణం.. ఓటుకు నోటు పేరుతో రేవంత్ పై వేసిన ట్రాప్.. బీఆర్ఎస్ మెడకే చుట్టుకుందని తేలిపోతుంది.