వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ శాసనసభ్యత్వంపై అనర్హతా వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశం కనిపిస్తోంది. సాంకేతిక కారణాలతో హైకోర్టులో విచారణ జరగలేదు. విచారణ జరిగితే.. ఆయనపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఇతర దేశాల పౌరసత్వం ఉన్న వారు ఇండియాలో పోటీ చేయడానికి అనర్హులు. అక్కడి పౌరసత్వం వదిలేసుకోవాల్సి ఉంటుంది. అయితే తాను జర్మనీ పౌరసత్వాన్ని వదిలేసుకున్నానని చెన్నమనేని రమేష్ చెబుతూ వస్తున్నారు.
చెన్నమనేని రమేష్ వేములవాడ నుంచి పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదట టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి.. మళ్లీ గెలుస్తూ వస్తున్నారు. ఆయన వేములవాడలో ఉండేది తక్కువ. కరోనా లాక్ డౌన్ కు ముందు ఆయన జర్మనీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఇండియాకు వచ్చిన దాఖలాలు లేవు. ఆయన భార్య కూడా జర్మనీ దేశీయురాలే. ఆయన పౌరసత్వంపై మొదటి సారి ఎన్నికయినప్పటి నుండి వివాదాలున్నాయి. ఆయనపై ఓడిపోతున్న ఆది శ్రీనివాస్ అనే నేత అదే పనిగా న్యాయపోరాటం చేస్తున్నారు. గతంలో ఆయనపై అనర్హతా వేటు వేశారు. అయితే అప్పీల్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మళ్లీ విచారణ సాగుతోంది.
ఇప్పుడు కేసు విచారణ చివరికి వచ్చినట్లయింది. జర్మనీ పౌరుడు పదేళ్లు చట్టసభల్లో ఉండటం.. తీవ్రమైన అంశంగా పరిగణించాలన్న ఆది శ్రీనివాస్ ఇప్పుడు కోర్టును కోరుతున్నారు. ఒక వేళ అనర్హతా వేటు పడితే రెండో స్థానంలో ఉన్న ఆది శ్రీనివాస్‌నే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో ఏపీలో ఓ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు పడితే.. రెండో స్థానంలో ఉన్నవైసీపీ నేతను ఎమ్మెల్యేగా ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ కూడా ప్రమాణస్వీకారం చేయించారు.