హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూల సంకలనాన్ని ఆ కార్యక్రమం హోస్ట్ వేమూరి రాధాకృష్ణ పుస్తకంగా తీసుకొచ్చారు. విజయవాడలో జరుగుతున్న బుక్ ఫెయిర్లో ఆ పుస్తకాన్ని విశాలాంధ్ర మాజీ సంపాదకుడు రాఘవాచారి విడుదల చేశారు. వేమూరి రాధాకృష్ణతో పాటు ఆంధ్రజ్యోతి సంపాదకుడు శ్రీనివాస్, రాజ్యసభ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, బీవీ పట్టాభిరామ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, తన ఇంటర్వ్యూలకు హాజరయ్యే అతిథులనుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. కార్యక్రమాన్ని ఆదరిస్తున్నవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాధాకృష్ణ తనదైన శైలిలో, జర్నలిజం ప్రమాణాలకు అతీతంగా, పల్లెటూళ్ళలో రచ్చబండలపైన మాట్లాడుకున్నట్లుగా అతిథులను ప్రశ్నలు అడగటం, సినిమా తారలనేమో ‘ఆ’ వ్యవహారాలేమైనా ఉన్నాయా అని అడగటం, అతిథులు జవాబులు చెప్పకుండానే ఈయనే అన్నీ చెప్పేస్తుండటం ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూల ప్రత్యేకత. ఏది ఏమైనా ఆ కార్యక్రమం విజయవంతంగా రెండో సీజన్ కూడా నడుస్తోంది.