గుంటూరు జిల్లాలో తాడికొండ మండలంలో గల లాంఫాంలో కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ వ్యవసాయ విద్యాలయానికి శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 ఎకరాల భూమిని కేటాయించింది. దీని కోసం సుమారు రూ.1505 కోట్లు కేటాయించవలసిందిగా ముఖ్యమంత్రి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధామోహన్ సింగ్ ను కోరారు. ఈ సభలో మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. “తెదేపా-బీజేపీలు విడిపోవాలని రాష్ట్రంలో ఒక పార్టీ కొరుకొంటోంది. తెదేపా తప్పుకొంటే ఆ స్థానంలోకి తను ప్రవేశించాలని ఆశగా ఎదురుచూస్తోంది. కానీ అది గమనించవలసిన విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు-నరేంద్ర మోడీ ఇరువురు మధ్య చక్కటి సమన్వయము, అవగాహాన, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉన్నాయని ప్రజలు భావించినందునే వారికి ఓట్లు వేసి గెలిపించారు. వారి జోడి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించారు. కనుక బీజేపీ-తెదేపా బంధం ఎప్పటికీ ఇలాగే బలంగా ఉంటుంది. అలాగే రాయలసీమకు అన్యాయం జరిగిపోతోందని ఆ పార్టీ చేస్తున్న ప్రచారం కూడా రాజకీయ దురుద్దేశ్యంతో కూడినదే. తెదేపా-బీజేపీలు కలిసి శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడానికి అనేక ప్రణాళికలు సిద్దం చేసుకొని అమలు చేస్తున్నాయి,” అని అన్నారు. వెంకయ్య నాయుడు చెపుతున్న ఆ పార్టీ ఏదో అందరికీ తెలుసు.