ఎన్‌డిఎ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, బిజెపిలోనే మహా ప్రసంగీకుడు వెంకయ్య నాయుడు ఇప్పుడు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వుండకపోతే పెద్దగా ప్రసంగాల అవసరం వుండదనుకున్న వారు ఇప్పుడు తలలు పట్టుకోవలసి వస్తున్నది. ఆత్మీయ సమ్మేళనం పేరిట హైదరాబాదులోనూ విజయవాడలోనూ జరిగిన సభల్లో ఆయన ఉపన్యాసాలలో వయస్సు ప్రభావం ఒకవైపు పరిస్థితుల ఒత్తిడి మరో వైపు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తనను పక్కనపెట్టలేదని చెప్పడానికి ఆయన రెండు చోట్లా అంత సమయం కేటాయించడం నిజంగా హాస్యాస్పదం. బహుశా ఒక జాతీయ నాయకుడు అలా మాట్లాడ్డం చూసి వుండం. ఇక వాజ్‌పేయి అద్వానీల తర్వాత తనే సీనియర్‌నని ఏ అర్థంలో అన్నారో గాని మురళీ మనోహర్ జోషి వంటివారు తక్కువేమీ కాదు. మూడు సార్లు ముఖ్యమంత్రులుగా చేసిన శివాజీ రావ్ చౌహాన్, రమణ్ సింగ్ వంటి వారూ వున్నారు. అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి వారు కూడా పార్టీపై ప్రభుత్వంపై పట్టులో ఆయనకంటే ఒకమెట్టు పైనే వుంటారు. వెంకయ్య బాగా సీనియర్ అన్న మాట నిజమే గాని స్వంత ముద్ర వేసింది, వ్యక్తిగత పునాది చాలా తక్కువ. వాజ్‌పేయి అద్వానీల పక్కన అద్యక్షుడుగా తాను కూచోవడం గురించి చెబుతున్నారు గాని ఆ సమయంలో మాట్టాడిన మాటలపై అటల్జీ ఎంత అలిగి కూచోవడం మర్చిపోయారు. తెలుగు వారు చాలా మంది జాతీయ స్థాయిలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆ నమ్రత మాత్రం ఆయన మాటల్లో కనిపించకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్రపతిగానూ తన పేరు పరిశీలించారని చెప్పుకోవడం ఇంకా విపరీతం.ఉన్నత పదవిలోకి వెళ్లే ముందు వెంకయ్య ఈ ఎంపిక పట్ట సంతోషంగా లేరని దేశమంతటికీ తెలుసు.ఆయన సన్నిహితులు దగ్గరగా వుండే వారు అందుకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేస్తున్నారు.అలాటప్పుడు అతిశయోక్తులు ఆత్మస్తుతి కట్టిపెడితే ఆయనకు వుండే గౌరవం ఆయనకు ఎలాగూ వుంటుంది.