అదీ మేటర్. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదు అని చెప్పి వెంకయ్యనాయుడికి 2014 ఎన్నికలకు ముందే తెలుసు. ఈ విషయాన్ని తాజాగా బిజెపి నేత సోము వీర్రాజు కన్ఫాం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదు అన్న విషయం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు కూడా తెలుసని చెప్పాడు. ఆ విషయం వెంకయ్యకు కూడా తెలుసట. అయితే ఎన్నికలకు ముందే ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ జనాలకు ఎందుకు చెప్పలేదు? ఆ ప్రశ్నకు కూడా ఓ డొంక తిరుగుడు సమాధానం చెప్పేశాడు సోము వీర్రాజు. అప్పట్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రుల్లో భావోద్వేగాలు ఉన్న దృష్ట్యా చెప్పలేదట. హవ్వ…..సీమాంధ్రులను దారుణంగా మోసం చేసి మళ్ళీ ఆ సీమాంధ్ర జనాలపైకే నెపం నెట్టడమన్నమాట.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదు అన్న విషయం అప్పట్లో ఉన్న భావోద్వేగాల దృష్ట్యా చెప్పలేకపోయారనే అనుకుందాం. మరి మోడీ-బాబుది అభివృద్ధి జోడీ…ఆ జోడీని గెలిపిస్తే పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎందుకు చెప్పినట్టు? పదేళ్ళు కాదు…పదిహేనేళ్ళపాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తా అని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పినట్టు? వెంకయ్యకు తెలిసిన విషయం చంద్రబాబుకు కూడా తెలిసే ఉంటుందిగా. హోదా తెస్తాం….ఇస్తాం అని చెప్పటమే కాదు…హోదా వళ్ళ ఎన్ని ఉపయోగాలున్నాయో…హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రం ఎలా అవుతుందో గంటల తరబడి చెప్పారు వెంకయ్య, చంద్రబాబులు. ఇప్పుడు వాళ్ళిద్దరే ఏమీ ఎరుగనట్టు హోదా వళ్ళ ఒరిగేదేంటో చెప్పమనండి అంటూ కామెడీగా ప్రశ్నిస్తుంటారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లు కొల్లగొట్టడం కోసం టిడిపి-బిజెపిలు కలిసి ఆడిన డ్రామాగా చివరికి ప్రత్యేక హోదా చరిత్ర ముగిసిపోయేలా ఉంది. అన్నట్టు ఈ సోము వీర్రాజుగారు పవన్ కళ్యాణ్‌కి బాగా సన్నిహితుడని చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్‌కి కూడా ఈ విషయం తెలుసా? ప్రత్యేక హోదా కోసం పోరాడుతా అని మాటలు చెప్తూ ఉండే పవన్…ఇప్పుడు సోము వీర్రాజు మాటలకు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.