కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని భాజపా అధిష్టానం మళ్ళీ రాజ్యసభకి ఎంపికచేయబోతున్నట్లు తాజా సమాచారం. భాజపా నిబంధనల ప్రకారం పార్టీలో ఏ వ్యక్తికీ రెండుసార్లుకంటే ఎక్కువ ఏ పదవిలోను కొనసాగించకూడదు. కానీ కేంద్రపట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి ఎం. వెంకయ్య నాయుడుకి మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఆయన పదవీకాలం ముగుస్తునందున, ఆయన చేత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించి, ఆయన సేవలను పార్టీ కోసం ఉపయోగించుకోవాలని భాజపా యోచిస్తున్నట్లు ఆ మద్యన మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆయనను కర్ణాటక నుంచి మళ్ళీ రాజ్యసభకి ఎంపిక చేసేందుకు భాజపా కారత్తు మొదలుపెట్టినట్లు అనుమానం కలుగుతోంది. ఆయనను కర్నాటక నుంచే మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకొనేందుకు ఆ రాష్ట్ర భాజపా ఒక తీర్మానం చేసి తమ అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. వెంకయ్య నాయుడి గురించి మీడియాలో వస్తున్న వార్తలను చూసిన తరువాత కూడా రాష్ట్ర నేతలు ఆవిధంగా సిఫార్సు చేసారంటే నమ్మశక్యంగా లేదు. కనుక అధిష్టానం ఆదేశాల మేరకే వారు ఆవిధంగా చేసి ఉండవచ్చు. అదే నిజమైతే వెంకయ్య నాయుడు యధాప్రకారం తన కేంద్ర మంత్రి పదవులలో కొనసాగవచ్చు.