తనకు సన్మానాలు అంటే గిట్టవు అంటారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సంచలన స్థాయి విజయాన్ని సాధించి.. రికార్డు స్థాయి మెజారిటీ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాకా కూడా మోడీ ఎక్కడా ప్రత్యేకంగా సన్మానాలు చేయించుకోలేదు. సొంత రాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ప్రసంగాలకు పరిమితం అయ్యారు కానీ..అంతకు మించిన హడావుడి లేదు. తన మంత్రి వర్గ సహచరులకు కూడా మోడీ ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు.
సన్మానాలు.. పురస్కారాలు అంటూ కాలయాపన వద్దు అని మోడీ సూచిస్తూ వస్తున్నారు. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ సమయంలో తన కొత్త మంత్రులకు ఇదే మాట చెప్పారు ప్రధానమంత్రి. మరి మిగతా వారి సంగతేమో కానీ.. మోడీ కి తనే అతిపెద్ద భక్తుడిని అని చెప్పుకునే, మోడీని దైవాంశ సంభూతుడు, అంత కన్నా ఎక్కువ, మోడీ దైవమే.. అనేసిన తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు మాత్రం పూటకొక చోట సన్మానం చేయించుకుంటున్నారు! ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అయ్యాకా వెంకయ్య కు ఎన్నో సన్మానాలు జరిగాయి!
ఏపీలో తెలుగుదేశం పార్టీ వాళ్లు, బీజేపీ నేతలు కలిసి ఒక సన్మానం చేశారు. ఎందుకు అంటే.. ఎక్కడో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనందుకు అన్నారు. అంతేనా.. తెలంగాణలో ఒక సన్మానం. ఆ తర్వాత కర్ణాటకలో కూడా వెంకయ్యకు సన్మానం జరిగింది. రాజస్థాన్ లో ఇంకోటి! ఆ హడావుడి అలా ఉంటే.. ఇప్పుడు మరో రీజన్ తో సన్మానాలు మొదలయ్యాయి. ఎందుకు అంటే.. కేంద్రంలో కొత్త గా ఒక శాఖ బాధ్యతలు స్వీకరించినందుకట! ఉన్నశాఖను ఒకటి కత్తిరించి.. మరో శాఖను అప్పగించారు వెంకయ్యకు! దీనికి కూడా సన్మానాలట!
ఒక రాష్ట్రంలో కాదు.. మొన్న ఏపీలో లో జరిగింది. అక్కడ వెంకయ్య రెచ్చిపోయి ప్రసంగించారు. తనకు ఉన్న స్నేహాలు.. ఎవరికీ లేవని చెప్పారు. తాజాగా తమిళనాడులో మరో సన్మానం జరిగింది! మోడీనేమో సన్మానాలు వద్దు అంటుంటే.. వెంకయ్య నాయుడుకి మాత్రం వరస పెట్టి అవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకో ఇలా..!