కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈమధ్య మైకు పట్టుకొంటే.. ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజీ తప్ప మరో మాట రావడం లేదు. జస్ట్ ఫర్ ఛేంజ్.. ఆయన సినిమాలపై ఓ సూపర్ స్పీచ్ ఇచ్చారు. సినిమాలపై ఆయనకున్న పరిజ్ఞానాన్ని, ఆవేశాన్ని, ఆలోచనల్ని వెళ్లగక్కారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ఇండీవుడ్ ఫిల్మ్‌ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్పీచ్‌లో నేటి సినిమాలపై చమక్కులు వినిపించాయి. ఇది వరకు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేశన్ సినిమాలు 365 రోజులు ఆడేవని, ఇప్పుడు 5 రోజులు ఆడితే సూపర్ హిట్ అంటున్నారని సెటైర్లు వేశారు. ఇది వరకు కళ్లతోనే శృంగారం పలికించేవారని ఇప్పుడు ముట్టుకొన్నా, ముద్దు పెట్టినా కిందామీదా పడినా శృంగారం ఒలకడం లేదని తనదైన శైలిలో వ్యాఖ్యానించడం సభికుల్ని ఆకట్టుకొంది.
ఇప్పటి సినిమాల్లో ఆర్భాటం ఎక్కువైందని, విషయం తక్కువైందని, సంగీత సాహిత్యాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, సంగీతం పేరుతో దంచిపడేస్తున్నారని… నేటి సినిమాపై విరుచుకుపడ్డారాయన. ఇదే సందర్భంలో రామోజీ రావు స్థాపించిన ఊషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చిన సినిమాల్ని కొనియాడారు. సందేశం ఉంటే సినిమాలు చూడరన్నది అబద్దమని, ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి చక్కటి సందేశంతో వచ్చిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయని, ఇప్పటికీ ఆ పంథాలో సినిమాలు తీస్తే బాగుంటుందని సూచించారాయన. సినిమా మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలని, పబ్లిసిటీ పరంగా కొత్త ఆలోచనలు చేయాలని అప్పుడే సినిమాకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ఇండీవుడ్ ముగింపు సభలో వెంకయ్య నాయుడు స్పీచే హైలెట్‌గా మారింది. సినిమాలపై ఆయనకున్న అభిప్రాయాలన్నీ ఒక్క స్పీచ్‌తో బయట పడిపోయినట్టైంది.