రాజకీయ అభిమానులు వేరు. సినిమా అభిమానులు వేరు. రాజకీయ నాయకులను అభిమానించే వారంతా సినిమా తారలను అభిమానిస్తారని చెప్పలేం. సినిమాలకు, సినిమా తరాలకు జేజేలు పలికే వారికి రాజకీయ నాయకుల ప్రసంగాలు అంతగా రుచించకపోవచ్చు. అయితే… సినీ అభిమానులనూ తన ప్రసంగాలతో నవ్వించగల, రంజింపజేయగల రాజకీయవేత్త మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక్కరే అనే చెప్పాలేమో. మంగళవారం రాత్రి యస్వీ రంగారావు శత జయంతి వేడుకల్లో ప్రస్తుత సినిమాల తీరుపై ఆయన వేసిన సెటైర్లకు నవ్వని వారు లేరంటే అతిశయోక్తి కాదు. తనదైన శైలిలో నేటి సినిమాలను తూర్పూర పట్టారు వెంకయ్య. సినిమాల్లో అసభ్యత, కథానాయికల అంగాంగ ప్రదర్శనలు, హింస… వేటినీ వదల్లేదు వెంకయ్య. పంచ్ డైలాగ్ రైటర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో వెంకయ్య పంచ్ డైలాగులు పేల్చారు. పాత సినిమాల్లో నవరసాలు పలికించిన నటీనటులున్నారని, ఇప్పుడు అటువంటి తక్కువమంది వున్నారని వ్యాఖ్యానించిన వెంకయ్య నాయుడు ఇంకా ఏమన్నారంటే…
– ఈతరం నటీనటులు ముందు నటనలో ఓనమాలు దిద్దాలి. నటన నేర్చుకుని సినిమాల్లోకి రావాలి. ఇప్పటి వాళ్లకు నటన రాదా? అని అడగవద్దు. వాళ్లకు రాదో? వచ్చో? నాకంటే ప్రేక్షకులకు బాగా తెలుసు.
– పాత సినిమాల్లో సంగీతానికి, సాహిత్యానికి, వాయిద్యానికి సమ ప్రాధాన్యత వుండేది. ఈతరం సినిమాల్లో సంగీతం తగ్గింది.. సాహిత్యం తగ్గింది… వాయిద్యం పెరిగింది. ఘంటశాల గొంతులో ఎంత మాధుర్యం వుండేది. ఇప్పటి పాటల్లో మాధుర్యం తగ్గింది… ఇంకేదో పెరిగింది.
– ప్రస్తుత సినిమాల్లో… శృంగారం తగ్గింది. అంగారం పెరిగింది. శృంగారమనేది సఖ్యతగా వుండాలి. అసభ్యతగా అన్పించకూడదు. జుగుప్స కలిగించకూడదు. అప్పట్లో హీరోయిన్లను హీరోలు టచ్ చేసేవారు కాదు. తమ నటనతో శృంగార భావన తీసుకొచ్చేవారు. హావభావాల్లో అంతా చూపేవారు. ఇప్పుడు హీరోయిన్ని తాకినా… పీకినా… గోకినా… శృంగారమేది? ఎక్కడా కనిపించదు. అంతా అంగారమే. నటీనటులకు హావభావాలు పలికించడం రాకపోవడమే అందుకు కారణం. ఈతరం నటీనటులు పాత సినిమాలు చూసి నటన నేర్చుకోవాలి.
– సినిమాలు సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా వుండాలి. అంతే తప్ప… ఫ్యామిలీ వేరుగా పిల్లలు వేరుగా చూసేలా వుండకూడదు. సినిమాల్లో రాసే మాటలు, పాటలు మన సంస్కృతిని ప్రతిభింబించే విధంగా వుండాలి. సమాజ మర్యాద కాపాడాలి. దర్శక నిర్మాతలు తాము తీసిన సినిమాలను కుటుంబ సభ్యులకు చూపించి ఓటింగ్ పెట్టుకోండి. ఫ్యామిలీ చూసేవిధంగా వున్నాయని ఎంతమంది చెబుతారో చూడండి.
– హింస, జుగుప్స, అసభ్యతలను సినిమాల్లో చూపిస్తే సమాజం బలహీనమవుతోంది. మనకు గొప్ప సంస్కృతి వుంది. దాన్ని నిలబెట్టే బాధ్యత వుంది. సినిమాల్లో హింస, అసభ్యత వంటివి లేకుపోతే ప్రేక్షకులు చూడడం కష్టమని అంటారా? ‘శంకరాభరణం’, ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినెమాలను ప్రేక్షకులు చూశారుగా. సినిమాలు చూసి ఎక్కువమంది ప్రభావితం అవుతారు కనుక క్రమశిక్షణతో సినిమాలు తీయాలి.