కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చాలా బాగా మాట్లాడతారనే ఇమేజ్ ఉంది! నిజానికి, ఒకే విషయాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రెజెంట్ చేయడంలో ఆయన దిట్ట..! ‘మోడీ’ అనే పదానికి ఎన్నిసార్లు కొత్త నిర్వచనం ఇవ్వమన్నా.. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. ప్రత్యేక హోదా ఎందుకు అవసరం లేదంటే… ప్రతీసారీ ఓ కొత్త కారణం చెప్పగలరు! అలాగే, ఆంధ్రాకి ఇస్తున్న ప్యాకేజీ గొప్పతనం గురించి చెప్పమన్నా.. ఏమాత్రం తడుముకోరు. ఇంత వాక్చాతుర్యం గల వెంకయ్య నాయుడు ఆ విషయంలో మాత్రం కొత్తదనం ప్రదర్శించలేకపోతున్నారేంటో! అదేనండీ.. నోట్ల రద్దు అంశం.
విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం ఎంతో ధైర్యంతో కూడుకున్న నిర్ణయం అన్నారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే సత్తా ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందన్నారు! నోట్ల రద్దు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దేశంలోని బడుగు, బలహీన, పేద వర్గాల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు ద్వారా భవిష్యత్తులో వీరందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. దేశాన్ని డిజిటలైజేషన్ వైపు నడిపించాలన్న మహా సంకల్పంతోనే మోడీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని మళ్లీ వివరించారు. నిజానికి, ఇవన్నీ గతంలో ఆయన చెప్పిన మాటలే. నోట్ల రద్దు తరువాత ఇవే మాటలు వినీవినీ ప్రజలు కూడా విసిగిపోతున్నారు.
నోట్ల రద్దు నిర్ణయం భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను ఇస్తుందంటున్నారే.. ఇంతకీ ఆ భవిష్యత్తు ఎప్పుడొస్తుంది..? పేద, బడుగు, బలహీన వర్గాలు ఆ ప్రతిఫలాల కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలి..? లాభం ఏ రూపంలో వస్తుంది..? ఎంత వస్తుంది..? ఎవరికి ఎంతెంత వస్తుంది..? వెంకయ్య చెబుతున్న ‘భవిష్యత్తు’ అనే బ్రహ్మపదార్థం ఎప్పటి నుంచీ ప్రారంభం అవుతుంది..? యాభై రోజుల తరువాత అంతా అద్భుతమే అన్నారు. ఆ యాభై దాటి మరో యాభై కూడా దగ్గరౌతోంది. ఇంకా భవిష్యత్తే అంటున్నారు.
నోట్ల రద్దు ద్వారా భాజపా సర్కారు ఏం సాధించిందో మొన్నటి కేంద్ర బడ్జెట్లో చెప్పకనే చెప్పారు. కొత్త కేటాయింపులు లేవు, కొత్త పన్నుల విధానాలు లేవు, కొత్త ప్రాజెక్టులు లేవు… ఇవి చాలవూ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏం సాధించిందో చెప్పడానికి..! పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం ఒరిగిందన్నది ప్రజలకు తెలిసిపోయింది. అయినా ఇంకా పాత పాటే పాడుతూ.. భవిష్యత్తు అద్భుతాలూ అని మాట్లాడితే విని హర్షించేవారు ఎవరుంటారు..? భాజపా కార్యకర్తలు కూడా చప్పట్లు కొట్టలేని బోరింగ్ టాపిక్ ఇది!