ఈమధ్య సినిమాల తీరుతెన్నుల మారిపోయాయి. ఇది వరకు రాముడు మంచి బాలుడు టైపులో మన హీరోలు ఉండేవారు. ఆ తరవాత హీరో క్యారెక్టరైజేషన్ లో మార్పులు వచ్చాయి. `నేనెంత ఎదవనో నాకే తెలీదు` అని క్వాయినింగ్ చేయడం కూడా హీరోయిజం అయిపోయింది. హీరోకీ, విలన్‌కీ పెద్ద తేడా ఏం ఉండడం లేదు. దొంగలూ, దోపిడీ దారులు, డాన్లూ, స్మగ్లర్లూ కూడా హీరోలైపోతున్నారు. ఈ పోకడపై చాలాకాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమాల ధోరణి గురించి ఆయన మాట్లాడారు. కొన్ని సినిమాల్లో హీరో పాత్రని మలుస్తున్న విధానం ఆక్షేపణీయంగా ఉందని, ప్రతినాయక పాత్రల్ని హీరోలుగా చూపించే ధోరణి మంచిదని కాదని, పిల్లలు వాటిని చూసి ఏం నేర్చుకొంటారని? ఆయన ప్రశ్నించారు. సినిమాల్లో ద్వందార్థ పదాలు వాడకుండా చూడాలని దర్శకులకు, రచయితలకూ హితవు పలికారు. వినోదం స్వచ్ఛంగా ఉండాలని, అందుకోసం బూతు వాడాల్సిన అవసరం లేదని, పాత సినిమాలే ఇందుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు.
సినిమా రచనల్లో ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, అశ్లీలత, ద్వందార్థాలూ లేకుండా క్లీన్ సినిమాలు చేయాలని దర్శకులకూ, రచయితలకూ సలహా ఇచ్చారు వెంకయ్య నాయుడు. ”అప్పట్లో సినిమాలు చాలా పద్ధతిగా ఉండేవి. పాతాళ భైరవి, మిస్సమ్మ లాంటి చిత్రాల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకొంటూనే ఉన్నాం. అవన్నీ స్వచ్ఛమైన వినోదం అందించాయి కాబట్టే తరాలు మారినా ఆ సినిమాల ప్రభావం తగ్గలేదు” అని అలనాటి క్లాసిక్ చిత్రాల్ని గుర్తు చేసుకొన్నారు వెంకయ్య నాయుడు.
ఇటీవల విడుదలైన ‘పుష్ప’, ‘యానిమల్’ చిత్రాల్లో హీరోల పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, ఆయా చిత్రాల్లో చూపించిన హింస, రక్తపాతం గురించి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’లో నటనకు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు ఇవ్వడం చాలామంది తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.