ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్పదో అనే విషయాన్ని ఏపీ ప్రజలకు నచ్చజెప్పే గురుతర బాధ్యతల్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రమే భుజాన వేసుకున్నారు.. ఏపీలో పర్యటిస్తున్నారు.. సభల్లో మాట్లాడుతున్నారు.. స్వపక్షనేతలతో సత్కారాలూ అందుకుంటున్నారు. మంగళవారం విజయవాడలో ఓ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడతోపాటు వెంకయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేదికను కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రాధాన్యతను వివరించేందుకు వాడుకున్నారు! ప్యాకేజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయని, ఆ విషయాన్ని కొంతమంది నమ్మలేకపోతున్నారు అంటూ కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు తనదైన శైలిలో చేశారు.
“నిత్య శంకితుడు అనేవాడు ఒకడుంటాడు. వాడు దేన్నీ నమ్మలేడు. అన్నీ అనుమానంగానే చూస్తుంటాడు. ప్రతీదాన్నీ అనుమానిస్తూనే ఉంటాడు. కేంద్రం రూ. 2.5 లక్షల కోట్లు ప్యాకేజీ ద్వారా ఇస్తోందిరా నాయనా అని చెప్పినా నమ్మడు. ఏమో ఎవరికి తెలుసు… ఇస్తుందో ఇవ్వదో అంటాడు. ప్యాకేజీ కేంద్రం ఇచ్చినా సరే దాన్లో ఎక్కడో ఏదో లీకేజీ ఉందని చూస్తుంటాడు. ఈ సభలో నిలబడితే పైనుంచి ఏదైనా పడిపోతుందేమో అని పైకి చూస్తాడు. బీసెంట్ రోడ్ మీదకి వెళ్తే… లారీ వచ్చి గుద్దేస్తుందేమో అని అనుమానం. ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా కంగారుగానే ఉంటారు” అంటూ వెంకయ్య చెప్పేసరికి సభా ప్రాంగణమంతా గొల్లుమంది. ఇంతకీ వెంకయ్య చెప్పిన ఆ నిత్య శంకితుడు ఎవరనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. అందరికీ అర్థమౌతున్నదే కదా.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎంత గొప్పదో అని చెప్పడం కోసం వెంకయ్య పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లు! మరో విషయమండోయ్.. ప్రత్యేక హోదాకి కొత్త మీనింగ్ కూడా ఇదే సభలో చెప్పారు! కేంద్రానికి ఆంధ్రా ప్రత్యేక రాష్ట్రమనీ, అదే ప్రత్యేక హోదా అని అన్నారు. అందుకే, కేంద్రమంత్రులు ఎవ్వరు ఏపీకి వచ్చినా ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకుని వస్తున్నారని అన్నారు. నెలలో కనీసం ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఏపీకి వస్తున్నారనీ, వచ్చివారు ఖాళీ చేతులతో రాకుండా ఏపీకి ఏదో ఒకటి ఇచ్చి వెళ్తున్నారు అన్నారు.
ఈ వ్యాఖ్యలు విన్నవారికి ఒకే ప్రశ్న మెదులుతుంది. వారి సంగతి సరే.. ప్రత్యేక హోదా తెస్తామని ఆంధ్రులకు చెప్పింది వెంకయ్య నాయుడే, కానీ ఆయన ఎందుకు తేలేకపోయారు అనేదే ఆ ప్రశ్న! హోదా ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు సూటిగా జవాబు ఏం చెప్పాలో వెంకయ్య నాయుడుకు తెలీదు. పోనీ, పక్కనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా “అయ్యా… మాకు హోదా ఎందుకు ఇవ్వలేదో కనీసం కారణమైనా చెప్పండీ” అని అడిగే సందర్భం ఎప్పటికీ రాదు. పైగా, ప్రజలు ఈ కోణంలో ఆలోచించే అవకాశం లేకుండా చేస్తూ…. నిత్య శంకితులూ, కేంద్రానికి ఆంధ్రా అంటే ప్రత్యేకం అంటూ చర్చను అటువైపు డైవర్ట్ చేయడానికి, వెంకయ్య నాయుడు తంటాలు పడుతున్నారు. ఆ విషయం ప్రజలకు అర్థమైపోతూనే ఉందే..!