ఇందిరే ఇండియా అన్న దేవకాంత బారువాను మించిపోయి నరేంద్ర మోడీ దేవుడిచ్చిన కానుకగా కీర్తించిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాటలు ఆరెస్సెస్ పీఠాధిపతులకు కూడా మింగుడుపడక గట్టిగానే మందలించారని ఆ పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మోడీ గురించి ప్రజలు అలా అనుకుంటున్నారని తాను చెబితే మీడియా తప్పుగా రాసిందని వెంకయ్య నాయుడు షరా మామూలుగా వివరణ ఇచ్చినట్టు మరో సమాచారం. వాస్తవానికి శ్రుతిమించిన పొగడ్తలు వెంకయ్యకు కొత్తేమీ కాదు. స్వతహాగా అద్వానీ అనుయాయుడుగా పేరున్న వెంకయ్య, వాజ్పేయి ప్రధానిగా వుండగా ఆయన ‘వికాస్ పురుష్’ అని కీర్తించి రాజకీయ ప్రతిష్టంభనకు కారణమైనారు. తర్వాత వాజ్పేయి ఎలాగో సర్దుకుని మళ్లీ సజావుగా సాగనిచ్చారు.
అదలా వుంచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అవకాశమొచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తి మాట్లాడ్డం ఎందుకని బిజెపి నేతలే ప్రశ్నిస్తుంటారు. మోడీని, చంద్రబాబును అదేపనిగా పొగిడే వెంకయ్య నాయుడు కన్నయ్య వంటి కుర్రాళ్లపై పదేపదే దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ కొత్తకొత్త హీరోలను తయారు చేస్తున్నదని ఇటీవలి ఘటనల తర్వాత ఆయన అపహాస్యం చేశారు. ఆయన నిరంతరం దేశ రాజకీయాలపైన ఏదో ఒక వ్యాఖ్యానం చేస్తూనే వుంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మీడియాకు మేత ఇస్తూనే వుంటారు. మీరు పార్టీ విధానాలను చెప్పవలసిన అధికార ప్రతినిధి కానప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని కూడా ఆరెస్సెస్ అగ్రనేతలు ఆగ్రహించినట్టు, ఆయనకు కూడా సన్నిహితులైన వారే వెల్లడించారు. ఈ ఏడాది చివరకు తెలుగుదేశం బిజెపి తెగతెంపులు ఖాయమైనప్పుడు చంద్రబాబును వూరికే పొగిడితే రేపు ఏం చెప్పుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు వాపోతున్నారు. అసలు హెచ్సియు విసిగా అప్పారావును మళ్లీ పంపించి ఇంత రభసకు అవకాశం ఇవ్వడం పార్టీకి ఏ విధంగా ఉపయోగమని కూడా కొందరు జాతీయ నాయకత్వానికి ప్రభుత్వాధినేతలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఇలాటివన్నీ ఆ సీనియర్నేత వైఖరిలో మార్పు రావడం అంత సులభమా