ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకి సభలో అనూహ్యమైన అనుభవం ఎదురైందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ! ఆయన ఉపరాష్ట్రపతి కాకముందు.. ప్రత్యేక ప్యాకేజీ తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. సన్మానాలు పొందారు. కానీ, దాన్ని కేంద్రం అమలు చెయ్యలేదు. ఇక, ప్రస్తుతం సభలో ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా భాజపా ఎంపీలు మాట్లాడుతున్నారు. జీవీఎల్ లాంటి కొత్త ఉత్సాహమున్న నేతలు ఏపీ సమస్యలపై ఇష్టమొచ్చినట్టు ప్రసంగిస్తున్నారు! ఈ నేపథ్యంలో వీటన్నింటి మధ్యా సభ నిర్వహించడం అనేది వెంకయ్యకు కత్తిమీద సవాల్ లాంటి అంశమే అయి ఉంటుందని అనుకోవచ్చు.
అయితే, సభ్యులో సభ్యులు ఎంతమంది గమనించారో లేదో తెలీదుగానీ… ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మధ్యమధ్యలో చేస్తూనే వచ్చారు. జీవీఎల్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎంపీలు అడ్డుపడుతుంటే.. ‘నెరవేర్చాలని ఎవ్వరూ ఏదీ అడగొద్దు. ముందుగా క్రమశిక్షణ కలిగిన సభ్యుడిగా బాధ్యత నెరవేర్చండి’ అన్నారు. ‘ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకుంటాయి, సభ కాదు’ అని మరో సందర్భంలో అన్నారు. ఇంకో సందర్భంలో, మనకేం జరిగిందో తెలుసుననీ, ఇక్కడ ఏయే స్థానాల్లో ఎవరు మాట్లాడామో తెలుసు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడామో తెలుసు, ఎవరు ఏ పార్టీలో ఉన్నా అవి వాస్తవాలే అంటూ వెంకయ్య అన్నారు. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారంటూ మరో సందర్భంలో అన్నారు. ఇతర పార్టీల సభ్యులు వారి సమస్యలు మాట్లాడుతుంటే… ‘ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకు సంబంధించి కట్ మోషన్ ఇచ్చారు, దీనికి సంబంధించిన అంశాలే మాట్లాడండి’ అని కూడా వెంకయ్య స్పష్టంగా చెప్పారు. జీవీఎల్ మాట్లాడుతున్నంతసేపూ ఆయన హావభావాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూనే ఉంటుంది.
ఒక దశలో ఏపీ అంశాలపైనే ‘మీరు గతంలో ఇక్కడున్నారు, ఇప్పుడు అక్కడున్నారు’ అంటూ కొంతమంది మాట్లాడితే ఇప్పుడు తానేం చెయ్యలేనని కూడా వ్యాఖ్యానించారు. మొత్తానికి, రాజ్యసభలో ఏపీ ప్రయోజనాల అంశమై జరిగిన చర్చా కార్యక్రమం వెంకయ్య నాయుడుని కొంత ఉక్కిరిబిక్కిరి చేసిందనే అనిపిస్తోంది. ఓపక్క భాజపాకి అనుగుణంగా వ్యవహరించక తప్పని పరిస్థితి, మరోపక్క ఆంధ్రా ప్రయోజనాలపై వాస్తవాలన్నీ తెలిసిన అనుభవం. అందుకే, ఆయనలో కొంత అసహనం కొన్నిసార్లు వ్యక్తమైందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.