హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ తాడేపల్లిగూడెంలో జరిగిన నిట్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ తన విమర్శకులపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సంయమనంగా ఉండే వెంకయ్యనాయుడు ఇవాళ ఆవేశంతో ఊగిపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ ఒక్క సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఏమేమి మంజూరు చేసిందో వివరిస్తే తనను విమర్శించేవారి నోట మాట రాదని అన్నారు. అయినా కొందరు విమర్శలు చేస్తూనే ఉంటారని, వారికి నిన్న గుర్తుండదని చెప్పారు. ఏదో ఒక తప్పుడు ప్రచారంచేయటమే వారిపని అన్నారు. తాను 40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నానని, అట్టడుగు స్థాయినుంచి పైకొచ్చానని చెప్పారు. వారసత్వ రాజకీయాలతో రాలేదని, రాజకీయాలలో వారసత్వంకాదు, జవసత్వం కావాలని అన్నారు. కులప్రాతిపదికపై, మతప్రాతిపదికపై తాను గెలవలేదని, గాలివాటు రాజకీయం చేయలేదని చెప్పారు. పుట్టినప్పటినుంచి అదే పార్టీలో ఉన్నానని, అదే పార్టీలో చస్తానని అన్నారు. చొక్కాలు మార్చినట్లుగా పార్టీలు మార్చేవారు తనను విమర్శిస్తారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అడ్డుకోవద్దని అన్నారు. విభజనబిల్లులో పేర్కొన్న ప్రతిఒక్క హామీని అమలు చేస్తామని చెప్పారు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని ఒకాయన అంటున్నాడని, తనకేమీ అభ్యంతరంలేదని అన్నారు. తాను వచ్చినప్పుడల్లా ఒక ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు. మోడి ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిన సంస్థల జాబితాను చదివారు. త్వరలో మంగళగిరిలో ఏఐఐఎమ్ఎస్ కూడా రాబోతోందని చెప్పారు. తనపై విమర్శలు చేసేవారిని తాను పట్టించుకోనని అన్నారు. తాను ఏపీ నుంచి ఎన్నిక కాలేదని, భవిష్యత్తులోకూడా నిలబడనని చెప్పారు.
నరేంద్ర మోడివైపు ప్రపంచమంతా చూస్తోందని, అమెరికా అధ్యక్షుడు ఒబామా రాక్ స్టార్ అన్నారని, రష్యా అధ్యక్షుడు పుతిన్ – హీ ఈజ్ ది మేన్ ఆఫ్ పీపుల్ అన్నారని చెప్పారు.