ప్రత్యేక హోదా విషయంలో అందరి కంటే ఎక్కువ మాట్లాడిన వారెవరయినా ఉన్నారంటే కేంద్రపట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడేనని చెప్పవచ్చును. ఒకవేళ కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే ఆ క్రెడి అంతా ఆయనకే దక్కేది. కానీ మొండి చెయ్యి చూపడంతో ఆ అపఖ్యాతి కూడా ఆయన ఖాతాలోనే జమా అయ్యింది. మరి ఈసంగతి ఆయన గ్రహించారో లేదో తెలియదు కానీ ప్రత్యేక హోదా అంశం గురించి చాలా రోజులు మాట్లాడకుండా తప్పించుకొన్న ఆయన మళ్ళీ నిన్న దాని గురించి మాట్లాడారు.
నెల్లూరు జిల్లాలో పొదలకూరు వద్ద ఒక ప్రభుత్వాసుపత్రి ప్రారంభానికి హాజరయినప్పుడు మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉంది. కానీ ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరిపోవని ప్రజలు గ్రహించాలి. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా అంతకంటే ఎక్కువగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్దంగా ఉంది. కేంద్రం నుండి పంచాయితీ వరకు అందరూ చేయిచేయి కలిపి పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యం. అగ్రరాజ్యాలుగా చెప్పుకొంటున్న దేశాలు సైతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్నప్పుడు కూడా భారత్ నిలకడగా ముందుకే సాగుతోంది. అంటే మనం అనుసరిస్తున్న విధానాలు సరయినవేనని స్పష్టం అవుతోంది,” అని అన్నారు.
గత నెలరోజులుగా ఈ ప్రత్యేక హోదా అంశం కొంచెం మరుగున పడిందనే చెప్పవచ్చును. దాని కోసం జగన్మోహన్ రెడ్డి గత నెల దీక్ష చేయాలనుకొన్నప్పుడు అధికార పార్టీ నేతలు అతనిపై విరుచుకు పడినప్పుడు మళ్ళీ దానిపై చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం తను చేయబోతున్న నిరాహారదీక్షకి ప్రజల, విద్యార్ధుల మద్దతు కూడగట్టుకోవడానికి ఆపసోపాలు పడుతుంటే వెంకయ్య నాయుడే స్వయంగా దానిని కెలికి జగన్మోహన్ రెడ్డికి మంచి ఆయుధం అందించారు. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇచ్చిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పడమే అందుకు ఉదాహరణ. ప్రత్యేక హోదా కోసం మళ్ళీ ఈనెల 7వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో నిరాహార దీక్షకి కూర్చోబోతున్న సమయంలో వెంకయ్య నాయుడు ఈ విధంగా మాట్లాడటం వలన జగన్ కి ఆయుధం అందించినట్లయింది. వైకపా నేతలు ఇదే ముక్కని పట్టుకొని మీడియా ఎక్కినా ఆశ్చర్యం లేదు.