కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు మొదటి నుంచి మీడియాతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువే. మాటకారి మాత్రమే గాక మీడియావారితో వ్యక్తిగత పరిచయాలు కూడా జాగ్రత్తగా పాటిస్తుంటారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వుండగా విజయవాడలో ఒక అడ్వర్టయిజ్మెంట్ వేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడి మరీ ఫోటో పంపించడం ఆశ్చర్య పరచింది. అప్పటికంటే కూడా ఇప్పుడు మీడియా మోజు మరింత పెరగడం ఇబ్బందికరంగా మారిందని తెలుగురాష్ట్రాల బిజెపి నేతలంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనే ఆయన ఆసక్తివల్ల అవసరాన్ని మించి చెప్పడం, అవతలివారిపై దాడి చేయడం, తర్వాత దాన్ని సమర్ధించలేక తాము సతమతమవడం జరుగుతుందని వారు వాపోతున్నారు. ఎపి బిజెపికి ఇంత వరకూ స్థిరమైన నాయకుడి నియామకం జరగలేదు గనక ఆయనే మాటే అంతిమం. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎప్పుడూ వెనకేసుకురావడంతో తము స్వంతంగా పెరగడం దుర్లభంగా వుందని వారి ఘోష. అక్కడికీ దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారు నిశిత విమర్శలు చేస్తూనే వుంటారు గాని అవి వ్యక్తిగత కుటుంబ కోపాల కింద కొట్టుకుపోతుంటాయి.
ఇక తెలంగాణలో ఆ పార్టీ అద్యక్షుడుగా వున్న కె.లక్ష్మణ్ వెంకయ్యకు సన్నిహితులే. కేంద్రమంత్రిగా వున్న బండారు దత్తాత్రేయ నిరంతరం మాట్లాడుతుంటారు గాని విెధానపరంగా గాని అధికార దర్పంలోగాని పెద్దగా నిలిచేవారు కాదు. పైగా పార్టీ నాయకులూ కార్యకర్తలలో ఒక భాగం ఆయనను పట్టించుకోరు. మీడియా ముందు కూడా తేలిగ్గా తీసేస్తుంటారు.ఇక అధికార హౌదాలో ప్రభుత్వ కార్య్యక్రమాలూ ప్రకటనలూ దత్తన్నకు దక్కుతుంటాయి. ఇప్పుడు మిర్చి సంక్షోభమే తీసుకుంటే బిజెఎల్పి నేత కిషన్‌రెడ్డి రంగంలోకి దిగి హడావుడి చేస్తున్నారే గాని దత్తన్న వూసు లేదు. దాంతో ఆయనా వూరుకోలేక ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లోగా హైదరాబాదులో దిగిన వెంకయ్య మిర్చిపై జరిగిన దాన్ని మించి వూదరగొట్టడంతో పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. ఇది చాలదన్నట్టు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తరపున కూడా నిరంతర ప్రచారం జరుగుతున్నది. వచ్చేఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిషన్‌రెడ్డి,లక్ష్మణ్, దత్తన్న,మురళీధరరావులలో ఎవరో ఒకరిని ప్రకటిస్తారని లీకులు ఇచ్చుకుంటున్నారు. హర్యానాలో వచ్చినట్టే ఇక్కడా అధికారంలోకి వచ్చేస్తామని టిబిజెపి నేతలు చెప్పుకుంటున్నారు.
ఇవన్నీచాలనట్టు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావును ముందుకు తేవచ్చని మరో వాదన. ఇలా ఎపిలో అద్యక్షుడు లేక తెలంగాణలో ఎవరు ముందో తేలక తర్జనభర్జన పడుతుంటే ఈ లోగా వెంకయ్య దిగబడిపోయి జాతీయ కోణ:లో ఏదో మాట్లాడ్డం తమ వ్యూహాలకు పెద్ద ఆలంకంగామారుతుందని ఆయన మీడియా మోజును తట్టుకోలేకపోతున్నామని బిజెపి నాయకులు కొందరు అంటున్నారు.ఆయన ఉత్తరాది రాజకీయాలను కేంద్రంలో తగ్గిన తన పట్టును దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే స్తానిక పరిస్తితులకు చాలాసార్లు పొసగడం లేదని వారి విమర్శ. అసలు అక్కడ పెద్దగా మాట చెల్లకనే ఇక్కడకువచ్చి హంగామా చేస్తుంటారని కూడా కొందరు ఆగ్రహిస్తున్నారు