‘కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కనిపించుట లేదు’ అని పత్రికలలో ప్రకటన వేయవలసిన అవసరం కనబడుతోంది. ఇదివరకు ఆయన వారానికి ఒక్కసారైనా ఆంధ్రాలో ఏదో ఒక ప్రాంతంలో కనబడుతుండేవారు. కానీ ప్రత్యేక హోదాపై మళ్ళీ రాష్ట్రంలో వేడి పెరిగినప్పటి నుంచి ఆయనరాష్ట్రానికి రాకుండా డిల్లీకే పరిమితం అయిపోయారు. పైగా భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్ధార్ద్ నాథ్ సింగ్ నేరుగా విజయవాడకే వచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదు.. ఇవ్వము అని కుండ బ్రద్దలు కొట్టినట్లు ప్రకటించడం, ఆ కారణంగా తెదేపా-భాజపాల మద్య చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండటంతో వెంకయ్య నాయుడు రాష్ట్రానికి వచ్చే ఆలోచన మానుకొన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పొగడకుండా వెళ్లరు. ప్రస్తుత పరిస్థితులలో ఆయన వచ్చి మాట్లాడితే తెదేపాపై కత్తులు దూస్తున్న రాష్ట్ర భాజపా నేతలకు కూడా ఆగ్రహం, ఇబ్బంది కలిగించినవారవుతారు. ఈసారి ఆయన తెదేపా తరపున రాజ్యసభకి వెళ్ళవచ్చని ఇదివరకు ఊహాగానాలు వినిపించాయి. కానీ తెదేపా తరపున రాజ్యసభకి వెళ్ళిన నిర్మలా సీతారామన్ కి కూడా తెదేపా మళ్ళీ సీటు ఇచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేయడంతో రెండు పార్టీల మద్య ఇంకా దూరం పెరిగింది. బహుశః అందుకే ఆయన రాష్ట్రానికి మొహం చాటేసినట్లున్నారు.