సమాచార ప్రసార శాఖా మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు.. సమాచార అణచివేత శాఖా మంత్రిగా చెలామణి అవుతున్నారా? అంటే.. అవుననే సమాధానాలు తాజాగా వెలువడుతున్నాయి. దేశరాజకీయాల్లోనూ, బీజేపీ చరిత్రలోనూ, ప్రస్తుతం మోడీ క్యాబినెట్ లోనే కాకుండా సీనియర్ పొలిటీషియన్స్ లోనూ తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న వెంకయ్య… ఈ మధ్యకాలంలో మాత్రం తన స్థాయికి, అనుభవానికి తగ్గట్లు నడుచుకోవడంలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మోడీని మితిమీరి పొగిడుతూ, సమర్ధించే క్రమంలో ఇలా ప్రవర్తిస్తున్నారా లేక ఈయన పొగడ్తలతో, సమర్ధింపులతో మిగిలినవాళ్లు ఏకీభవించడం లేదని ఇలా చేస్తున్నారా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. తాజాగా వెంకయ్య తీసుకుంటున్న నిర్ణయాలపై మాత్రం రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిన్నమొన్నటివరకూ ఏపీ స్పెషల్ స్టేటస్ కి అనుకూలంగా మాట్లాడినా, ప్రత్యేక ప్యాకేజీ కి వ్యతిరేకంగా మాట్లాడినా అంతెత్తున లేచిన వెంకయ్య… తాజాగా డీమానిటైజేషన్ పై ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో డీమానిటైజేషన్ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన, సామాన్యుడి కష్టాలను సమస్యలను ప్రసారం చేసిన టీవీ ఛానల్స్ పై వెంకయ్య కక్షసాధింపు చర్యలకు పూనుకుంటున్నారని తెలుస్తుంది. ఈ మేరకు తమ ప్రభుత్వ నిర్ణయాలకు తందానతాన అనని ఛానల్స్ కు తాజాగా వెంకయ్య మంత్రిత్వశాఖ హెచ్చరికలు జారీచేసింది. అలా అని హెచ్చరికలతోనే ఆపేసిందనుకుంటే పొరపాటే… ఈ ఛానల్స్ కు కేంద్రంనుంచి వచ్చే అడ్వర్టైజ్ మెంట్స్ ని కూడా నిలిపేసింది.
ఈ క్రమంలో ప్రకటనలు ఆపేసినా కూడా ఈ ఛానల్స్ లొంగకపోవడమో, బేఖాతరు చేయడమో చేసేటప్పటికి ఈ ఛానల్స్ విషయంలో మంత్రిగారే స్వయంగా రంగంలోకి దిగి.. వీటి లైసెన్సులకు ఎర్త్ పెట్టే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా ఛానల్స్ లైసెన్స్ ఫైళ్లనన్నింటినీ స్వయంగా తెప్పించుకుని స్టడీ చేస్తున్నారట. వీటిలో ఏ చిన్న అవకాశం దొరికినా ఆయా ఛానల్స్ లైసెన్సులనే రద్దు చేయాలని భావిస్తున్నారట. అయితే.. ఈ బెదిరింపులకు భయపడి.. సదరు మీడియా ఛానళ్లు వెంకయ్య ముందు సాష్టాంగ పడతాయా.. లేక ఈ విధంగానే ముందుకు వెళ్తాయా అనేది వేచి చూడాలి!
ఏది ఏమైనా… ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏవైనా సమస్యలు ఉన్నా, వాటివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా… వాటి గురించి మరిచిపోయి నిస్సిగ్గుగా భజన చేయాలని ప్రభుత్వాలు కోరుకోవడం ఎలాంటి ప్రజాస్వామ్యం కిందికి వస్తుందో అని పలువురు ప్రశ్నిస్తుండగా.. ఇది వెంకయ్య మార్కు ఎమర్జెన్సీ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.