బీజేపీలో ఏ వ్యక్తికీ మూడుసార్లకు మించి రాజ్యసభ సీటు ఇవ్వరాదని పార్టీ నిర్ణయం తీసుకొంది. ఆ కారణంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకి మళ్ళీ రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం కోల్పోబోతున్నారు. 2016 జూన్ తో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. కేంద్రమంత్రిగా కొనసాగాలంటే ఆరు నెలలోగా ఆయన పార్లమెంటు ఉభయసభలలో దేనిలో ఒకదానిలో సభ్యుడిగా ఎన్నికవలసి ఉంటుంది. బీజేపీ తీసుకొన్న నిర్ణయం వలన ఆయనకు మళ్ళీ రాజ్యసభ సీటు రాదూ కనుక లోక్ సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. దాని కోసం ఎవరో ఒకరు తమ లోక్ సభ స్థానాన్ని ఖాళీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుండి ఆయన పోటీ చేసి గెలవవలసి ఉంటుంది. అందుకు ఆయన ఇష్టపడట్లేదని సమాచారం.
ఆయన ప్రధాని నరేంద్ర మోడికి చాలా సన్నిహితుడు కనుక ఆయనను ఉప రాష్ట్రపతిగా నియమించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే మోడీ ప్రభుత్వ తీరుపత్ల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పార్టీలో సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని సంతృప్తి పరిచేందుకు రాష్ట్రపతిగా నియమించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా చాలా సమయం ఉన్నందున ఈ ఊహాగానాలను బీజేపీ దృవీకరించలేదు.
ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ పదవీ కాలం 2017 ఆగస్టులో ముగుస్తుంది. కనుక 2016 డిశంబర్ లో వెంకయ్య నాయుడు తన కేంద్ర మంత్రి పదవి నుండి తప్పుకొంటారా? లేకపోతే ఆయన కోసం బీజేపీ తన నిబంధనను సడలించి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా నియమిస్తుందా? లేకపోతే 2017 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా నియమించే వరకు ఆయనకు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగిస్తుందా? అనే విషయాలు వచ్చే జూన్ లేదా డిశంబర్ నాటికి తెలియవచ్చును. ఒకవేళ ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి నుండి తప్పుకొన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నష్టపోతుంది. ఆయన చొరవ వలననే రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, నిధులు కేంద్రం నుండి అందుతున్నాయి. విభజన కారణంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి కేంద్ర మంత్రిగా తన వల్ల వీలయినంత సహాయం చేయాలని వెంకయ్య నాయుడు తపిస్తుంటారు. ఆయన ఆ పదవిలో నుండి తప్పుకొన్నట్లయితే ఆ స్థానంలోకి ఇంకా ఎవరు వచ్చినా ఆంధ్రాకు సహాయసహకారాలు, న్యాయం చేస్తారనే నమ్మకం లేదు.