కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎం. వెంకయ్య నాయుడు, సుజనా చౌదరిల రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగుస్తుంది. వారిలో వెంకయ్య నాయుడుకి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపాకున్న మూడు రాజ్యసభ స్థానాలలో ఒకటి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు నిన్న డిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసినపుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించవచ్చును.
ఏపిలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలున్నాయి. వాటిలో తెదేపాకున్న శాసనసభ్యుల సంఖ్యా బలానికి మొత్తం మూడు స్థానాలు దక్కుతాయి. మరొకటి వైకాపాకు దక్కుతుంది. ఆ మూడింటిలో ఒక దానిని రాష్ట్రానికి చాలా సహాయపడుతున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుకి కేటాయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు కనుక మిగిలిన రెండు స్థానాల కోసం చాలా పోటీ ఉంటుంది.
కేంద్రమంత్రి సుజనా చౌదరిల రాజ్యసభ పదవీకాలం కూడా జూన్ లోనే పూర్తయిపోతుంది. ఆయన తన పదవిలో కొనసాగాలంటే ఆరు నెలలోగా తప్పనిసరిగా లోక్ సభ లేదా రాజ్యసభలలో దేనిలో ఒకదానిలో సభ్యుడుగా ఎన్నిక కావలసి ఉంటుంది. కనుక మళ్ళీ ఆయనకే రాజ్యసభ సీటు కేటాయించవలసి ఉంటుంది. కానీ ఈసారి ఆయన రాజ్యసభ సీటుని నారా లోకేష్ కి కేటాయించి, కొడుకుని కేంద్ర మంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు అనుకొంటున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెదేపా నేతలెవరూ ఆ వార్తలను దృవీకరించలేదు. ఒకవేళ ఆ సీటు నారా లోకేష్ కి కేటాయించకపోతే మళ్ళీ సుజనా చౌదరికే కేటాయించవచ్చును. మిగిలిన ఒక్క సీటుకి తెదేపాలో చాలా మంది పోటీ పడుతున్నారు కనుక ఈసారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి కేటాయించలేకపోవచ్చును. కనుక ఈసారి ఆమె వేరే రాష్ట్రం నుండి రాజ్యసభ సీటు సంపాదించుకోవలసి ఉంటుంది.