కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు కుటుంబానికి చెందిన స్వర్ణభారతి ట్రస్టుకు తెలంగాణ సర్కారు లబ్ధి చేకూర్చిన్నట్టు ఇటీవలే ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 2 కోట్ల మేర లబ్ధి చేకూర్చేలా తెలంగాణ సర్కారు రహస్య జీవో జారీ చేసిందని, ఆ వివరాలను గోప్యంగా ఉంచడం వెనక అర్థమేంటంటూ కొన్ని ఆరోపణలు వినిపించాయి. ఇదే అంశమై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ కూడా వెంకయ్య నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై వెంకయ్య కార్యాలయం స్పందించింది. ఆ స్పందన కూడా ఎలా ఉందంటే… కర్ర విరగకుండా పాము చావకుండా అన్న సామెత తీరుగా ఉందని చెప్పొచ్చు!
స్వర్ణభారతి ట్రస్టు ఎలాంటి లాభాలనూ ఆశించి పనిచేస్తున్నది కాదని తెలంగాణ సర్కారే చెప్పిన విషయాన్ని గుర్తించాలని వెంకయ్య కార్యాలయం స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ట్రస్టుకు ఎలాంటి రాయితీలు అందలేని ప్రకటించింది. మహిళ కోసం, నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాల శిక్షణ కోసం, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం కోసం ట్రస్టు కృషి చేస్తోందన్నారు. ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింతగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కొన్ని పన్నుల మినహాయింపులు ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని వెంకయ్య కార్యాలయం పేర్కొంది. కేసీఆర్ కుటుంబంతో ఉన్న వ్యాపార సంబంధాలపై కూడా వెంకయ్య ఈ సందర్భంలో స్పందించడం విశేషం! తన కుటుంబం చేస్తున్న వ్యాపార లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదనీ, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలీదనీ, ఆ వ్యవహారాలకు దూరంగా ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు. ఈ మధ్య తెలంగాణ సర్కారు హర్షా టొయోటా కంపెనీ నుంచి వాహనాలు కొనుగోలు చేసిందన్న ఆరోపణల్ని కూడా వెంకయ్య కొట్టిపారేశారు. టొయోటా కంపెనీతో తెలంగాణ సర్కారు నేరుగా డీల్ చేసి, వాహనాలు కొనుగోలు చేసిందని చెప్పారు. ఉప రాష్ట్రపతి కాబోతున్నవేళ, తనపై తప్పుడు ఆరోపణలు చేసి బురద చల్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అంటూ జైరాం రమేష్ పై వెంకయ్య మండిపడ్డారు.
వెంకయ్య కుటుంబానికి చెందిన ట్రస్టుకు రూ. 2 కోట్లు లబ్ధి చేసేలా తెరాస సర్కారు ఇచ్చిన జీవోపై సవివరంగానే మీడియాలో కథనాలు వచ్చాయి. గతంలో ఏ ట్రస్టుకూ ఇంత భారీ ఎత్తున మినహాయింపులు ఇస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని సాక్షాత్తూ హెచ్.ఎం.డి.ఎ. అధికారులు వాపోయారనీ వినిపించింది. దీనిపై నేరుగా స్పందించకుండా… సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే క్రమంలో పన్ను మినహాయింపులు వచ్చినట్టు వెంకయ్య చెప్పి, రహస్య జీవో గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం విశేషం! పోనీ, సేవల నేపథ్యంలో ఇచ్చిన ఆ మినహాయింపులు ఆరోపణల్లో వినిపిస్తున్నట్టుగా రూ. 2 కోట్లా, అంతకంటే తక్కువా అనేది కూడా స్పష్టం చెబితే బాగుండేది.