అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… నిన్న ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన ప్రసంగం.. కలకలం రేపింది. జగన్మోహన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి వెంకయ్య మద్దతిచ్చారంటూ.. విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో.. వెంకయ్యనాడు.. హడావుడితో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించి.. తాను రాజధాని తరలింపులనకు వ్యతిరేకమని.. నేరుగా చెప్పేశారు. అయితే.. అమరావతి గురించి మాత్రం నేరుగా చెప్పలేదు. పాలనా వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలన్నది… పాలన కేంద్రీకృతం కావాలని… అభివృద్ధి వికేంద్రీకృతం కావాలన్నది తన అభిమతమని స్పష్టం చేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు సహా.. పాలనా వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలని.. స్పష్టం చేసి.. ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించారు వెంకయ్యనాయుడు.
మంగళవారం అమరావతి రైతులు.. వెంకయ్యనాయుడిని కలిశారు. అయితే.. వారితో ఎక్కువ సేపు మాట్లాడలేదు. తనకు మొత్తం తెలుసని.. తన అభిప్రాయాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెబుతానని చెప్పి పంపేశారు. దీంతో రాజధాని రైతులు నిరాశకు గురయ్యారు. ఈ విషయంపై.. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాజధాని రైతుల భావోద్వేగం చూసి తనకు ఎంతో మనస్థాపం కలిగిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకున్నాక తన అభిప్రాయాన్ని అవసరమైన చోట చెబుతానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.
కొన్నాళ్లుగా ఏపీ సీఎం జగన్ .. ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్నప్పటికీ.. వెంకయ్యనాయుడుని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆయనను పలుమార్లు వ్యక్తిగతంగా కించ పరిచేలా మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియం.. ఇతర అంశాల్లో వెంకయ్యనాయుడు పేరు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ.. వెంకయ్యనాయుడు.. ఈ విషయాలను వ్యక్తిగతంగా తీసుకోలేదు. తాను చెప్పాలనుకున్న చోట చెబుతానని అంటున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేయలేనంటున్నారు.