రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రకటించబోతున్నారా? లేకపోతే ఆశలు పెట్టుకున్న ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారా ? ఈ అంశం ఢిల్లీలో హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిని ఏ క్షణమైనా బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటించబోతోంది. అయితే పార్లమెంటరీ బోర్డు ఆమోదం లాంచనప్రాయమే..అసలు నిర్ణయాలు మాత్రం మోడీ, షా చేతుల్లోనే ఉంటాయి. వారు ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టాలో ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు. వారెవరన్నది స్పష్టత లేదు. హైదరాబాద్లో యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తర్వాత హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.
వెంటనే ఆయన వద్దకు అమిత్ షా, నడ్డా వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయనే రాష్ట్రపతి అభ్యర్థి అనే ప్రచారం ఊపందుకుంది. అయితే అభ్యర్థిగా ప్రకటించడానికి ఆయన వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని..కేవలం బుజ్జగింపులకు వెళ్లారని అంటున్నారు. ఈ సారి ఎస్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని అందుకే చత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఊకేను అందు కోసం ఫైనల్ ఛేశారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే దక్షిణాది సమీకరణాలతో వెంకయ్యనాయుడుకు అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా రాష్ట్రపతి రేసులో చివరికి ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి వెంకయ్యనాయుడు కాగా మరొకరు అనసూయఊకే. అయితే రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుని మోదీ, షాలు అంగీకరించరన్న ఓ వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ ఇమేజ్ లేని రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసినట్లుగానే ఈ సారి అనసూయ ఊకేను చేస్తారన్న ప్రచారం మాత్రం ఎక్కువగా సాగుతోంది. ఈ సస్పెన్స్ సాయంత్రానికి తేలిపోయే అవకాశం ఉంది.