కేంద్ర మంత్రి బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడు అంటే తెలుగువారు గౌరవిస్తారు. రాజకీయాభిప్రాయాలు ఎలా వున్నా జాతీయ స్థాయిలో కీలక పాత్ర వహిస్తున్నారని సంతోషిస్తారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం లోనూ ఆయన ప్రధాన సహాయక పాత్ర కనిపిస్తూనే వుంది. ఈ కారణంగానే నిబంధనలను కూడా పక్కనబెట్టి ఆయనను నాలుగోసారి రాజ్యసభకు పంపింది బిజెపి. ఇదంతా నిజమే గాని ఈ వూపులో మరీ గొప్పలు చెప్పుకుంటే చెల్లిపోతాయా? తాను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక బయిటకు వెళ్లలేదని ఆయన చెప్పుకోవడం అవసరం లేని వ్యవహారం. బిజెపి బలాబలాలు వెంకయ్య నాయుడు వ్యక్తిగత జయాపజయాలు రాష్ట్రమంతటికీ తెలుసు.1978లోనూ, 1983లోనూ ఆయన ఎంఎల్ఎగా నెగ్గిన మాట నిజమే. అది కేవలం ఆయన వ్యక్తిగత ఘనత గాని బిజెపి రాజకీయ ఘనత కాని అనుకోవడానికి వీల్లేదు. మొదట గెలిచిందిజనసంఫ్ుి అభ్యర్థిగా కాదు- జనతా పార్టీ తరపున! నెల్లూరు జిల్లాలో కొన్ని భూస్వామ్య శక్తులు రాజకీయాలను కూడా పక్కనపెట్టి ఆయనను గెలిపించేందుకు మద్దతిచ్చాయి గనకే గెలిచారు. జిల్లాలో భూస్వాములు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనసంఫ్‌ు/బిజెపి ి జెండాలు మూడూ రెడీగా పెట్టుకుని వుంటారని అప్పట్లో జోక్. 1983లో ఆయన వుంటే మంచిదని అలాటి శక్తులే అండగా నిలిచాయి.(ఇటీవలి వరకూ పనిచేసిన తెలంగాణ బిజెపి ముఖ్య నేతకు గాలి జనార్థనరెడ్డి చలవతో వైఎస్ రాజశేఖరరెడ్డి అండదండలు లభిస్తాయని చెప్పుకునేవారు) వాగ్ధాటి వున్న వెంకయ్య నాయుడు అక్కరకు వస్తాడనే అంచనా ఆ శక్తులకు వుంది. ఇవన్నీ తెలిసి కూడా ఇందిరాగాంధీ వచ్చినా ఎన్టీఆర్ వచ్చినా తాను గెలిచానంటూ వారినే ఓడించినట్టు చెప్పుకోవడం మరీ అతిశయోక్తి.
ఆ సమయంలో వెంకయ్య నాయుడు సమకాలీకులుగా వున్న జైపాల్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా తమ తమ పద్ధతుల్లో పైకి వచ్చారు. 1990ల నాటికే జైపాల్‌రెడ్డి రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాగలిగారు. రాష్ట్ర బిజెపి అద్యక్షుడుగా పనిచేసిన వెంకయ్య నాయుడు ఎలాటి ప్రత్యేక ముద్ర వేసింది లేదు. చాలా మంది జాతీయ నాయకులు తమ పార్టీల పరిధిలోనే ఎప్పుడో ఒకప్పుడైనా తమవైన వ్యక్తిత్వాలు చూపించిన సందర్బాలుంటాయి గాని వెంకయ్య నాయుడు ఆ బాధే లేని అచ్చమైన కెరీరిస్టు. ఢిల్లీ వెళ్లిన తర్వాత మూడుభాషల్లో మాట్లాడే శక్తిపెంచుకోవడం, ఎవరు పార్టీ నాయకత్వంలో వుంటే వారికి సన్నిహితంగా మెసలడం ఆయనకు ఒక స్థానం కల్పించాయి. రాష్ట్రాలలో రాజకీయ పునాది లేని వారిని కేంద్రంలో ఉపయోగించుకోవడానికి పాలకవర్గ పార్టీల అధిష్టానాలు మొగ్గుచూపుతుంటాయి. అద్వానీ శిష్యుడైన వెంకయ్య నాయుడు వాజ్‌పేయి హయాంలో అద్యక్షుడై చేసిన కొన్నివ్యాఖ్యలు ఎంతటి వివాదానికి దారితీశాయో మళ్లీ చెప్పనవసరం లేదు. అద్వానీ పట్టుతగ్గిన తర్వాత ఈయన మళ్లీ ఎప్పుడూ ఆ విధేయతను చూపిందీ లేదు. ఇక మోడీ తనకన్నా జూనియర్ అయినాసరే అతిగా నెత్తికెత్తుకుని అనుగ్రహం సంపాదించారు. అరుణ్జైట్లీలా సుష్మా స్వరాజ్‌లా కనీసం రాజ్నాథ్సింగ్లా కూడా ఏ దశలోనూ స్వంత ప్రయత్నంచేసింది లేదు. ఈ కారణంగానే పార్లమెంటులోనూ జాతీయ రాజకీయాల్లోనూ మోడీ వెంకయ్యపై ఆధారపడటం అలవాటు చేసుకున్నారు. ప్రమోద్ మహాజన్ స్థాయిలో కాకపోయినా తన స్థాయిలో వెంకయ్య కూడా వ్యాపార వర్గాలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ద్వయంతో ఉమ్మడిగా సంబంధాలు గల బలమైనలాబీలు వున్నాయి. కనుకనే ఎప్పుడూ పరస్పర ప్రశంసలలో తేలిపోతుంటారు. ఎన్టీఆర్‌నే ఓడించానని వెంకయ్య గొప్పలు పోయినా చంద్రబాబుకు అభ్యంతరం వుండదు.
కాకపోతే ఒకే ఒక ప్రశ్న- నిజంగా వెంకయ్య నాయుడు అంత సన్నివేశం వుంటే- తానే చెప్పిన ప్రత్యేక హౌదా ను ఎందుకు తేలేకపోయారు? టాకేజీ తప్ప ప్యాకేజీ సాధించలేకపోవడానికి కారణమేమిటి?