ఏంటో… ఆయనకి అన్నీ అలా తెలిసిపోతాయంతే! ఆయనేనండీ… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు! ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబులోని ‘పనిమంతుడు’ని ఆయనే గుర్తించారు. రాష్ట్రం కోసం ఆయన మంచి చేస్తున్నారనీ, అందుకే ఆయన్ని పొగుడుతూ ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో కూడా ఓ కొత్త కోణాన్ని ఆయనే గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మోడీ అంటే… మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అంటూ ఆ మధ్య ఓ నిర్వచనం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంతకీ మోడీలోకి కొత్త కోణం ఏంటంటే… సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్షణాలు ఉండటం! ఢిల్లీలో జరిగిన జాతీయ సమైక్యతా ర్యాలీలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ లక్షణాలు ఉన్నాయని అభివర్ణించారు. ప్రస్తుత భారత దేశానికి మరో సర్దార్ పటేల్ అవసరమనీ, అలాంటి నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పారు. ఎంతోమంది ప్రముఖ నేతలను ఇన్నాళ్లూ దేశం విస్మరించందనీ, వారి కృషిని స్మరించుకునే అవకాశం ఎన్.డి.ఎ. ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. భారతదేశానికి తొలి ప్రధానిగా సర్దార్ పటేల్ బాధ్యతలు చేపట్టి ఉంటే, నేడు మన పరిస్థితి మరోలా ఉండేదని వెంకయ్య అన్నారు. అయితే, ఈ అభిప్రాయం తనది కాదనీ, కోట్లాది భారతీయులది కూడా అని వెంకయ్య చెప్పడం విశేషం! నేతాజీ లాంటి మహా నేతల్ని కూడా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదనీ, ప్రస్తుత మోడీ సర్కారు అలాంటి నేతలకు సముచిత గౌరవం ఇస్తోందని వెంకయ్య చెప్పారు.
ఛాన్స్ దొరికితే చాలు, మోడీ భజన చేస్తారని మరోసారి వెంకయ్య నిరూపించుకున్నారు! మోడీలో పటేల్ లక్షణాలు ఉన్నాయని చెప్పడమే అతి అనుకుంటే… ఏకంగా మోడీనే పటేల్ అని అభివర్ణించడం అనేది భజనలో పీక్స్! భారత దేశానికి నెహ్రూ ఎంతో చేశారని చెబితే… ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆ ప్రభావం తగ్గించడం కోసమే అన్నట్టుగా పటేల్, నేతాజీల వంటి వారికి తామే సముచిత గౌరవం ఇస్తున్నట్టు భాజపా చెప్పుకోవడం గమనార్హం. ఈ ‘సముచిత గౌరవం’ ముసుగులో భాజపా చేస్తున్నది రాజకీయం కాదా! నాటి మహా నేతల్ని గౌరవించడం కూడా తాము సాధించిన విజయంగా చెప్పుకోవడం సమంజసమా..? ఏదేమైనా మోడీలో పటేల్‌ని చూపించిన ఘనత వెంకయ్య నాయుడికే దక్కుతుందని చెప్పుకోవాలి!