హైదరాబాద్: క్షణం తీరికలేకుండా ఎప్పుడూ రాజకీయాలలో మునిగితేలే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు నిన్న తీరిక చేసుకుని శ్రీమంతుడు చిత్రాన్ని వీక్షించారు. సినిమా చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చూస్తుంటే తన చిన్నతనం గుర్తొచ్చిందని అన్నారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని ఎవరూ మరచిపోగూడదని అన్నారు. స్వచ్ఛభారత్నుకూడా బాగా ప్రచారం చేయాలని, దీనిపైకూడా సినిమా తీయాలని కోరారు. నేటి సినిమాలలో అశ్లీలత ఎక్కువగా ఉంటోందని, అయితే శ్రీమంతుడులోమాత్రం విజ్ఞానం, వినోదం ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం ఎంపీ, మహేష్ బావ గల్లా జయదేవ్ కేంద్రంలోని మంత్రులు, తెెలుగు ఎంపీలకోసం ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మరోవైపు సినిమా అనేది ధియేటర్లో చవిచూడాల్సిన అనుభవమని, తన సినిమాలను పెద్దతెరపైనే చూసి ఎంజాయ్ చేయాలని మహేష్ కోరారు. పైరసీని అంతమొందించాలంటూ తన అభిమానులకు, సినిమాలను అభిమానించే అందరికీ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. బాక్సాఫీస్ వద్ద శ్రీమంతుడు కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.