ఉత్తరాది ఆధిపత్య ధోరణితో దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు కామెంట్స్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న టీటీడీ ఈవో నియామకం విషయంలో కూడా దక్షిణాదివారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చను లేవదీశారు. దక్షిణాదిపై భాజపా శీతకన్నేస్తోందన్న విమర్శలు ఈ మధ్య వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు భాజపా ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగానే ఆ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం జులైతో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై రకరకాల అంచనాలు తెరమీదికి వచ్చాయి. చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరేంటంటే… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు! అవునండీ… రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఆయనా ఉన్నారనీ, పార్టీలో ఈ ప్రతిపాదనపై చర్చ జరుగుతోందంటూ భాజపా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. తాను రాష్ట్రపతి ఎన్నికల బరిలో, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉంటానని వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. తనకు రాష్ట్రపతి కావాలనే కోరికలేదనీ, ఉన్న పదవితోనే సంతృప్తిగానే ఉన్నాననీ, ప్రస్తుతానికి ఉషాపతిగానే సంతోషంగా ఉన్నానని అన్నారు. ఉషా అంటే వెంకయ్య సతీమణి పేరు. సో.. ఇలా చమత్కరించి ఈ చర్చకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు.
అయితే, హస్తిన రాజకీయ వర్గాల్లో మాత్రం వెంకయ్య పేరును పరిగణనలోకి తీసుకుంటున్నారనే అంటున్నారు. ఎందుకంటే, దక్షిణాది రాష్ట్రాలపై భాజపా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పార్టీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఈ మధ్యనే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పర్యటించారు. వాస్తవ పరిస్థితులపై అవగాహన పెంచుకుని వెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణాదికి చెందిన ప్రముఖుడికి అవకాశం ఇవ్వడం రాజకీయంగా భాజపాకి ప్లస్ అవుతుందనే ఆలోచనలో భాజపా అధినాయకత్వం ఉందని అంటున్నారు. అందుకే, పార్టీకి ఎప్పట్నుంచో వీర విధేయుడిగా ఉంటూ, సౌమ్యుడిగా పేరున్న వెంకయ్య నాయుడు పేరును అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. ఇలా చేయడం వల్ల దక్షిణాదికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది కదా!