ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఒకే వేదిక మీదకి వస్తే ఎలా ఉంటుంది..? ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచేస్తారు. బాబు విజనరీ అని వెంకయ్య అంటే, వెంకయ్య చొరవ అనన్య సామాన్యం అన్నట్టుగా చంద్రబాబు చెబుతారు. అయితే, అమరావతిలో అందుకు కాస్త భిన్నమైన వాతావరణం కనిపించింది! రాజధానిలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం ఎస్.ఆర్.ఎమ్. ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పనులూ ప్రభుత్వం చెయ్యలేదనీ, అందుకే కొన్ని పనుల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో, ఇతరులు ఏమనుకుంటున్నా, ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా లెక్క చెయ్యకుండా ప్రైవేటు – ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గతంలో చెప్పినట్టుగానే ఆంధ్రాను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉంటూ, అవకాశం వచ్చిన అన్ని సందర్భాల్లోనూ రాష్ట్రానికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు. ఆంధ్రా రాజధాని అమరావతికి రెండేళ్లు కిందటే కేంద్రం రూ. 1000 కోట్లు మంజూరు చేశామనీ, అమరావతి చారిత్రక సంపదను కాపాడుకునేందుకు వారసత్వ నగరంగా కేంద్రమే గుర్తించిందన్నారు. అమృత యోజన కింద ఏదైనా నగరానికి నిధులు విడుదల కావాలంటే కనీసం లక్ష జనాభా ఉండాలనీ, కానీ అమరావతికి ఎలాంటి రూపు రేఖలు ఏర్పడకపోయినా తాను చొరవ తీసుకుని, ఈ పట్టణాన్ని కేంద్రం గుర్తించేలా కృషి చేశానన్నారు. ఆ విధంగా అదనపు నిధులు తెప్పించా అని చెప్పారు. అమరావతిలో ఇంకా నగరం ఏర్పడకపోయినా కూడా దాన్ని నగరంగా గుర్తించేలా చేశానని చెప్పుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు సవరించేలా కృషి చేసి, స్మార్ట్ సిటీల జాబితాలో అమరావతి పేరుండేలా తాను చొరవ తీసుకున్నా అన్నారు. అమరావతిలో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు అవసరమైన సాయాన్ని కూడా కేంద్రం చేస్తుందన్నారు.
కేంద్రమంత్రిగా, ఆంధ్రాకు చెందిన నాయకుడిగా రాష్ట్రానికి తాను ఏమేం పనులు చేశానో అనే విషయాలనే ప్రధానంగా చెప్పేందుకు వెంకయ్య నాయుడు ప్రయత్నించడం గమనార్హం! ఓపక్క చంద్రబాబు కూడా కూర్చున్న ఈ సభలో కేంద్రమే రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తోందని, కేంద్రమే నిధులు మంజూరు చేస్తోందనీ, అమరావతి నగరాభివృద్ధికి తాను చాలా కృషి చేస్తున్నాననే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ వేదికను వెంకయ్య నాయుడు బాగానే వినియోగించారని చెప్పుకోవచ్చు. గతంలో చంద్రబాబు గొప్పతనం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండే వెంకయ్య… ఇప్పుడు తన చొరవ గురించి సొంతంగా ఇలా ప్రొగ్రెస్ కార్డు ఇచ్చుకోవడం విశేషమే. ప్రతీ విషయంలోనూ చంద్రబాబును వెనకేసుకుని రావడం అనేది కాస్త తగ్గించుకోవాలంటూ ఆ మధ్య వెంకయ్యకు ఢిల్లీ పెద్దలు ఉద్బోధ చేసినట్టు కథనాలు వచ్చాయి. అది నిజమో కాదో తెలీదుగానీ.. వెంకయ్య వాయిస్ లో మార్పు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది.