ఏడాది క్రితం హెచ్‌సియుతో మొదలై జెఎన్‌యు వరకూ పాకిన విద్యార్థి అశాంతికి చాలా మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అసహనం తాండవించింది. అప్పట్లో మరీ రెచ్చిపోయి దాడి చేసిన సృతి ఇరానీని మొదట పోగిడినా తర్వాత ఆ శాఖ నుంచి తప్పించారు. రోహిత్ వేముల విషయంలో మాత్రం దళితుడు కాదని ప్రకటించడం ద్వారా ఎఫ్ఐఆర్లో చిక్కిన కేంద్ర మంత్రులను అధికారులను కాపాడేందుకు రంగం సిద్దం చేశారు. అయితే ఈ లోగానే మరోసారి రామ్జాస్ కాలేజీలో ఎబివిపి వారి బెదిరింపులు వాతావరణాన్ని ఉద్రిక్తం చేశాయి. దీనిపై నిరసన తెల్పుతున్న ఎస్ఎప్ఐ ఎఐఎస్‌ఎప్ వంటి సంఘాల వారిపై మరో సారి దాడి చేయడం జాతీయ స్తాయిలోనే మీడియాలో తీవ్ర అభిశంసనకు దారితీసింది. ఇలాటి పరిస్థితిలో కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ తనపై అత్యాచారం చేస్తామని ఎబివిపివారు బెదిరించినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అందుకు స్పందించి సహాయం అందించే బదులు కేంద్ర మంత్రి కిరెన్ రిజ్జు గుర్మెహర్ బుర్రను ఎవరో ఖరాబు చేశారని ఎదురు దాడికి దిగారు. ఆమె ట్విట్లర్ను శోధించి ఎప్పుడో ఏదో రాసిందని విమర్శలు గుప్పించారు. 20 ఏళ్ల ఆ యువతి వీటిని తట్టుకోలేక ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కేంద్ర నేతలకు తీవ్రత అర్థమైంది. రాజ్‌నాథ్‌సింగ్,రవిశంకర్ ప్రసాద్ వంటివారు ఆమెపై ఆరోపణలు సరికాదని ప్రకటించడమే గాక పంజాబ్‌లో ఆమె భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపున జెఎన్‌యులో అప్పటి కీలక పాత్రధారి కన్నయ్య కుమార్ దేశద్రోహ ప్రసంగం చేసిన ఆధారాలేమీ లేవని 40 క్లిప్పింగులు పరీక్షించిన పారెన్సిక్ నివేదిక వెలువడింది. అతనిపై ఎలాటి ఛార్జిషీటు ఇంకా దాఖలు చేయలేదని పోలీసులు చెప్పడంతో ఎబివిపి వారు వెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో దాడికి కారణమైన ఎబివిపి కార్యకర్తలు ఇద్దరిపై పోలీసులు చర్య తీసుకుంటే సంస్థ వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.
ఈ పరిణామాలన్నీ ఇంతగా బెడిసికొడుతుంటే పరిశీలన బొత్తిగా లేని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం సహజశైలిలో దేశభక్తి దేశద్రోహం అంటూ ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు. అన్ని విధాల అడ్డం తిరిగిన వాదనలన్నీ మరోసారి వల్లెవేయడమే తప్ప తమ పార్టీ సీనియర్ మంత్రులు ప్రదర్శించిన పాటి వాస్తవికత విజ్ఞత చూపించలేకపోయారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులపై ఆయనకు కోపం వుండొచ్చు గాని ముందు దారి తప్పుతున్న తమ విద్యార్థి విభాగాన్ని అసహన రాజకీయాలను అరికట్టవలసిన అవసరాన్ని గుర్తించడం అంతకన్నాముఖ్యం. అనుభవంతో నాలుగు మంచి మాటలు రాయాలి గాని రాజకీయ కోణమే ప్రధానమైతే పెద్దరికం ఏమయ్యేట్టు?
దేశ సమగ్రత పై రాజీ లేదు..ఈ రోజు ఆంధ్రజ్యోతి లో నా వ్యాసం..https://t.co/GbbxNLkg0r pic.twitter.com/y2jOfNTmNI
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 2, 2017