ఇన్నాళ్లూ భారతీయ జనతా పార్టీలో చంద్రబాబునాయుడు అంటే పీకల్దాకా కోపం మరియు ద్వేషభావం ఉన్న నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న పురందేశ్వరి, సోము వీర్రాజు లాంటి వారు మాత్రమే అలాంటి అడ్డగోలు డైలాగులు మాట్లాడుతున్నారని అంతా అనుకున్నారు. ఒకవైపు కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీ రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన వాటాలు, ధర్మబద్ధంగా కేటాయించాల్సిన నిదుల విషయంలో మొండిచేయి చూపిస్తున్నదని, ముష్టి లాగా విదిలిస్తున్నదని… వంచిస్తున్నదని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈనేపథ్యంలో మేం రాష్ట్రానికి 1.46 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చేశాం.. అంటూ పసలేని పాచిపోయిన పాత పాట పాడడం ఆ పార్టీ నాయకులకే చెల్లు. అంతో ఇంతో చేదు వాస్తవాల్ని ఇండైరక్టుగా చెప్పేస్తూ.. ఇలాంటి అబద్ధపు ప్రకటనల జోలికి వెళ్లని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇప్పుడు అదే పాట అందుకుంటున్నారు.
ఒకటిన్నర లక్షల కోట్లు అక్కడికేదో నిధులు ఏపీ ప్రభుత్వానికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లుగా భాజపా నాయకులు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఏవేవో ప్రకటించిన పథకాల పేరిట విడతలు విడతలుగా మొత్తంగా విడుదల కాబోయే… నిధులన్నిటినీ టోటల్ చేస్తే ఇలా 1.46 లక్షల కోట్లు అవుతుందనే మర్మం వారు ముడివిప్పి చెప్పరు.
ఇలాంటి డొంకతిరుగుడు మైలేజీ సాధించే కుయుక్తులు ఏదో చిన్నస్థాయి నాయకులకు ఉంటే అది ఒక ఎత్తు. కానీ ఏపీ పరిస్థితులు , ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ స్పష్టంగా తెలిసిన వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నాయకుడు కూడా ఇలాంటి మెరమెచ్చు మాట్లాడడం ఏం గౌరవం అనిపించుకుంటుంది. నిర్దిష్టంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరానికి వారేమి ఇచ్చారో చెప్పాలి. రాజధాని బాధ్యత కేంద్రానిదే గనుక.. అక్కడి నిర్మాణాలకు నిర్దిష్టంగా ఏమొత్తాలను విడుదల చేశారో చెప్పాలి. అలాంటి రాష్ట్ర ప్రయోజనాలకు సంబందించిన పనులకు కేంద్రం ఇచ్చిన సొమ్మును వాడకుండా ఉంటే గనుక… చంద్రబాబు సర్కారును గల్లా పట్టుకుని నిలదీయడానికైనా కేంద్రానికి అధికారం ఉంటుంది. అలా కాకుండా.. ఇలాంటి మాయ మాటలు చెబుతూ ప్రజల్ని నమ్మించవచ్చుననుకుంటే బోల్తా కొడతారు.