ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా అని రాయప్రోలు సుబ్బారావు వేరే సందర్బంలో అన్నమాటను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు మరోలా అన్వయించుకోవచ్చు. నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూ హడావుడిగా వుండే ఆయనకు చడీచప్పుడూ లేని రాజ్యాంగ లాంచనమైన ఉపరాష్ట్రపతి పదవిలో కూచోవడం ఎలా వుంటుంది? నిస్సందేహంగా చాలా కష్టంగా వుంటుందని తెలుసుగనకే వద్దంటే వద్దని మొండికేశారు.అయినా ఆఖరుకు ఒప్పుకోక తప్పలేదు. అయితే అక్కడకు వెళ్లాక ఎలా వుందంటే పెద్ద తేడా ఏం లేదంటున్నారు. ఈ మధ్యనే ఆరెస్సెస్ అనుబంధిత బిజెపి నేత ఒకరు మాట్లాడుతూ ఇందుకో ఉదాహరణ చెప్పారు. ఫలానా వ్యాపార వేత్త మాట్లాడాలని వచ్చారు, ఏముంది పంపించేశాం..మరోసారి ఏదో రాజకీయ సమస్య వచ్చింది. వెళ్తూ వెళ్లూ ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్లారు.. ఏ సమస్య రాలేదు అని అన్నారు.
. వెంకయ్య నాయుడు మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి పుస్తకావిష్కరణ సభలో తనదైన ప్రాస ప్రయోగించకపోలేదు. భారత దేశంలో వంశ పారంపర్య పాలన మామూలైపోయిందని రాహుల్‌గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ‘ డైనాస్టీ(వంశపారంపర్యం) చాల నాస్టీ.. కాని కొందరికి టేస్టీ అని చమత్కరించారు. అన్నట్టు ఒకసారి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి కూడా మొదటి చురక వంశపారంపర్యంపైనే వేయడం ఆసక్తికరం. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి కుమారుడైన కాంతి దేశాయిపై రకరకాల ఆరోపణలు వస్తుండేవి. ఆ సమయంలో నీలం చైన్నరులో రాజాజీ శతజయంతి సభల్లో మాట్లాడారు.’ రాజాజీ అదృష్టవంతుడు. కుమారులు లేరు గనక వంశపారంపర్య సమస్యలు రాలేదు’ అనగానే అవి మొరార్జీపై ఎక్కుపెట్టిన బాణాలుగా భావించారు.
అలా అని అస్సలు తేడా లేదనీ కాదు. మంత్రుల సమావేశాలు, సందడి, నిర్ణయాలు అమలు సమీక్ష ఆ తరహానే మరోరకంగా వుంటుంది కదా.. ఇప్పుడు రాజకీయ వివరణలు అడగడానికి ఏ మీడియా వారూ రారు. ప్రతిపక్షాలపై ఎడాపెడా మాట్లాడే వీలూ వుండదు. ఇది భరించలేని ఉపరాష్ట్రపతి తనకు ఇష్టమైన మీడియా ప్రతినిధులను అధికార నివాస సందర్శన పేరిట పిలిచారట. ఆ భవనంలో హనుమాన్ మందిరాన్ని, మసీదును చూపించారట. తనకు ముందున్న హమీద్ అన్సారీ కట్టించిన ప్రార్థనా మందిరాన్ని సమావేశాలకోసం వినియోగిస్తానని కూడా చెప్పారట. ఇదంతా కూడా మీడియాతో ముచ్చటించేకోణంలోనే వుందని ఢిల్లీ వారి మాట.