ఉత్తరాఖండ్ రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మీడియా నుంచి ఊహించని ప్రశ్న ఎదురయింది. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మొదట ఆయన కొంత ఇబ్బందిపడినా, మళ్ళీ తేరుకొని దీనిపై టీ-కాంగ్రెస్, వైకాపాల వాదనలకు అనుగుణంగానే ఆయన సమాధానం చెప్పడం విశేషం.
ఫిరాయింపులకు పాల్పడే ప్రజా ప్రతినిధులపై ఫిరాయింపుల చట్ట ప్రకారం అనర్హత వేటు వేయవలసిందేనని, దానికి నిర్దిష్ట కాలవ్యవది కూడా పెట్టడం చాలా అవసరమని ఆయన అన్నారు. అంతేకాదు, జగన్ వాదిస్తున్నట్లుగానే ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొనే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఏవయినా కారణాల చేత ప్రజా ప్రతినిధులు పార్టీలు మారాలనుకొంటే తప్పు లేదు కానీ పార్టీ మారేటప్పుడు వారు తమ పదవులకు రాజీనామా చేయడం మంచి పద్దతని, దానిని పాటించనివారిపై అనర్హత వేటు వేయడం తప్పు కాబోదని ఆయన అన్నారు.
ఇంతా చెప్పిన తరువాత, ఉత్తరాఖండ్ లో భాజపా ప్రోత్సాహంతో హరీష్ రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేయడం మాత్రం సరికాదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే తన పార్టీకో నియమం, ఇతర పార్టీలకయితే మరో నియమం అన్నట్లుంది.
పార్టీలు ఫిరాయిస్తున్న ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేయాలని చెపుతున్న వెంకయ్య నాయుడు స్వయంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రిగా ఉన్నారు. కనుక ఈ విషయంలో తనే స్వయంగా చొరవ తీసుకొని పార్లమెంటులో ఫిరాయింపుల చట్టంలో ఆ సవరణలు చేయడానికి బిల్లు పెడితే బాగుంటుంది కదా? రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఫిరాయింపులపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని మిత్రపక్షం తెదేపా చేస్తున్న ఫిరాయింపుల గురించి కూడా వెంకయ్య నాయుడు తన అమూల్యమయిన అభిప్రాయం చెపితే ప్రజలు కూడా హర్షిస్తారు కదా?