తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై భారతీయ జనతా పార్టీలోనే ఒక స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. ఈ మధ్య ఆంధ్రా పర్యటనకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా సొంతంగానే బరిలోకి దిగుతుందన్నట్టుగా కేడర్ కు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు విషయంలో ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. దీంతో… 2019 ఎన్నికల్లో భాజపా సింగిల్ గానే బరిలోకి దిగుతుందని స్థానిక నేతలు భావించారు. ముఖ్యంగా ఏపీలో పొత్తు విషయమై దాదాపు ఒక స్పష్టత వచ్చేసిందనే అనుకున్నారు. పైగా, అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా టీడీపీతో కలిసి కొనసాగడంపై పునరాలోచించాల్సి ఉందని అనడంతో ఓ క్లారిటీ వచ్చేసిందనే అందరూ భావించారు. అయితే, ఇప్పుడు వెంకయ్య నాయుడు మరోలా మాట్లాడుతున్నారు!
టీడీపీతో పొత్తు విషయమై కాస్త ఆలోచించాలని కొద్దిరోజుల కిందట చెప్పిన వెంకయ్య, ఇప్పుడు పొత్తు కొనసాగుతుందన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీతో బలమైన సంబంధాలు భాజపా ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. రెండు పార్టీలపైనా ఈ మధ్య కొంత విషప్రచారం జరుగుతోందనీ, దీన్ని నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండు పార్టీలూ కలిసి ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందనీ, ఏపీకి రూ 2.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామనీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి వెంకయ్య చెప్పారు. శాశ్వత అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చిస్తాననీ, ఏపీని అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని అన్నారు.
నిజానికి, అమిత్ షా పర్యటనకు వచ్చినప్పుడు వెంకయ్య సైలెంట్ గా ఉన్నారు. పొత్తుపై పునరాలోచన చేయాలని అమిత్ షాతో పాటు, వెంకయ్య కూడా అభిప్రాయపడేసరికి టీడీపీలో కొంత గుబులు మొదలైన మాట వాస్తవమే. అందుకే, భాజపా ఇలా స్పష్టత ఇస్తున్నా టీడీపీ నుంచి ఎవ్వరూ ఎలాంటి విమర్శలూ చెయ్యలేదు. తొందరపడి భాజపాపై విమర్శలు చెయ్యొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్టీ నేతలతో ఒకటికి రెండుసార్లు చెప్పినట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇప్పుడు వెంకయ్య ఇలా స్పష్టత ఇవ్వడంపై తెర వెనక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పనిలేదు. చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఇచ్చే అండదండలు అందరికీ తెలిసినవే.
మొత్తానికి, టీడీపీతో పొత్తు విషయమై అమిత్ షా మనోగతం ఒకలా ఉంటే, వెంకయ్య నాయుడు తాజా అభిప్రాయం ఇంకోలా ఉంది. రాష్ట్రంలో భాజపా నేతలు టీడీపీతో పొత్తు వద్దు అనుకుంటూ ఉంటే, కేంద్రంలో భాజపాతో పొత్తు అవసరమని టీడీపీ వెంపర్లాడుతోంది. ఈ క్రమంలో భాజపా ఆంధ్రాలో బలపడేది ఎప్పుడు..? వాస్తవ పరిస్థితి ఇది! మున్ముందు ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.