లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఇకపై తమ పార్టీ ఏ ఎన్నికలలో పోటీ చేయబోదని ప్రకటించారు. అంతేకాదు ఇకపై తమ పార్టీని రాజకీయ పార్టీగా కూడా చూడవద్దని ప్రజలకు, మీడియాకి, రాజకీయ పార్టీలకి కూడా విజ్ఞప్తి చేసారు. వర్తమాన రాజకీయాలలో భారీగా పెట్టుబడి పెట్టగల పార్టీలు, నేతలే మనుగడ సాగించగలుగుతున్నారు తప్ప లోక్ సత్తా వంటి చిన్న చిన్నపార్టీలు మనుగడ సాగించలేని దుస్థితి నెలకొని ఉంది. అందుకే జయప్రకాశ్ నారాయణ అటువంటి కటినమయిన నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని భావించవచ్చును.
ఒక మంచి ఆదర్శవంతమయిన లోక్ సత్తా వంటి పార్టీ, వర్తమాన రాజకీయ పరిస్థితులలో ఇమడలేక బయటకి వెళ్లిపోయినందుకు చాలా మంది బాధపడ్డారు. కానీ అయన నిర్ణయాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం స్వాగతించడమే కాదు అభినందించారు కూడా.
పార్టీని స్థాపించి నడిపించడం అంత తేలిక కాదని తను లోక్ సత్తా స్థాపిస్తున్నపుడే జయప్రకాశ్ నారాయణ చెప్పానని, ఎన్నికలలో పాల్గొనకుండా పార్టీని నడిపిస్తే అది ఇంకా ప్రభావంతంగా పనిచేస్తుందని కూడా తను సలహా ఇచ్చినట్లు చెప్పారు.రాజకీయాలకు అతీతంగా ప్రజలలో చైతన్యం కలిగించడం ద్వారా, ప్రభుత్వంలోని వ్యవస్థలపై ఒత్తిడి తేవడం ద్వారా కూడా సమాజంలో ఆశించిన మార్పు సాధించవచ్చని, కనుక జయప్రకాశ్ నారాయణ సరయిన నిర్ణయమే తీసుకొన్నారని తను భావిస్తున్నట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. లోక్ సత్తా ఎన్నికలలో నుంచి తప్పుకోవడంతో తమ పార్టీకి ఎన్నికలలో కనీసం ఆ ఒక పార్టీ నుంచి అయినా పోటీ తగ్గుతుందని వెంకయ్య నాయుడు లోలోన సంతోషపడుతున్నారేమో?
జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వెంకయ్య నాయుడు, రేపు ఆయన ఏదయినా అవినీతి లేదా అక్రమాల గురించి మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అప్పుడు కూడా ఇలాగే స్వాగతించగలరా? అంటే అనుమానమే.
నీతి, నిజాయితీకి కట్టుబడి ఉండే లోక్ సత్తా వంటి ఒక మంచి పార్టీ, డబ్బుతో ముడిపడున్న ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోవడం అభినందించాల్సిన విషయం కాదు…బాధపడాల్సిన విషయం. అది ప్రజాస్వామ్యానికి చాలా అవమానకరమయిన విషయం అని చెప్పక తప్పదు.