17 బ్యాంకులకు రూ. 9,000 కోట్లు కుచ్చు టోపీ పెట్టేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాని తప్పకుండా వెనక్కి రప్పించి అతని చేత బ్యాంకులకు చెల్లించవలసిన బాకీని అంతా కక్కిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
“ఆయనకి ఎన్నిసార్లు నోటీసులు పంపినా భారత్ తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఆ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియదు కానీ ఆయనని భారత్ తిరిగి రప్పించదానికి మా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ రద్దు చేశాము. ఇప్పటికీ ఆయన తీరు మారకపోతే ఇంకా కటినమయిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఆయనను భారత్ రప్పించి, బ్యాంకులకు చెల్లించవలసిన ప్రతీ పైసా చెల్లింపజేస్తాము.అందులో ఎటువంటి సందేహమూ అవసరం లేదు,” అని వెంకయ్య నాయుడు మీడియాతో అన్నారు.
విజయ్ మాల్యా దేశం నుంచి పారిపోయే అవకాశాలున్నాయని తెలిసి ఉన్నప్పటికీ, పట్టించుకోకుండా విడిచిపెట్టేసి, ఇప్పుడు ఆయనను వెనక్కి రప్పించడం అంటే ఏదో ఘన కార్యం చేస్తున్నట్లుగా ఉన్నాయి వెంకయ్య నాయుడు చెపుతున్న మాటలు.
విజయ్ మాల్యా లండన్ పారిపోయే రెండు రోజుల ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరోపించారు. అది చాలా తీవ్ర ఆరోపణే. కానీ దానికి భాజపా నేతలు కానీ, కేంద్ర మంత్రులు గానీ సమాధానం చెప్పలేదు. అటువంటప్పుడు వారిద్దరూ ఎందుకు సమావేశమయ్యారు? దేని గురించి మాట్లాడుకొన్నారు? అనే ఆయన ప్రశ్నలకు సమాధానం చెపుతారని ఆశించడం అత్యాశే. విజయ్ మాల్యా పారిపోవడానికి మోడీ ప్రభుత్వమే సహకరించిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. దానికీ జవాబు లేదు.
వెంకయ్య నాయుడు ఇదివరకు ప్రత్యేక హోదా గురించి చాలా మాట్లాడేవారు. ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడటం లేదు. ఏపికి ఆర్ధిక ప్యాకేజి గురించి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన దాని గురించి మాట్లాడటం లేదు. పురందేశ్వరి రైల్వే జోన్ వస్తుందని హామీ ఇస్తున్నారు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదని చెపుతున్నారు. కనుక విజయ్ మాల్యాని వెనక్కి రప్పించడం, ఆయన చేత బ్యాంకులకి బాకీలు తిరిగి చెల్లింపజేయడం..గురించి వెంకయ్య నాయుడు చెపుతున్న మాటలను కూడా అది జరిగేవరకు నమ్మలేని పరిస్థితి కనబడుతోంది.