వచ్చే రెండు నెలలలో 8 మంది కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. వారిలో వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, చౌదరీ బీరేంద్ర సింగ్, ముక్తార్ అబ్బాస్ భాజపాకి చెందినవారు కాగా, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు తెదేపాకి చెందినవారు.
ఈ మద్య కాలంలో తెదేపా-భాజపా సంబంధాలు దెబ్బతిన్నాయి కనుక ఈసారి నిర్మాలా సీతారామన్ కి తెదేపా తరపున రాజ్యసభ సీటు కేటాయించకపోవడం సహజమే. ఆమె పనితీరు పట్ల ప్రధాని మోడీ కూడా సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. ఆమెకు తెదేపా రాజ్యసభ సీటు ఇవ్వకపోయినా మోడీ తలుచుకొంటే ఆమెను వేరే రాష్ట్రం నుంచి ఎంపిక చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కొందరు కేంద్రమంత్రులు, ఆర్.ఎస్.ఎస్.నేతలు ఆమెను ఆ పదవిలో నుంచి తప్పించాలని మోడీపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఆమెను ఆ పదవి నుంచి తప్పించి పార్టీ సేవకి ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఒత్తిళ్ళకి లొంగి సమర్ధంగా పనిచేస్తున్న ఆమెను పదవి నుంచి తప్పిస్తే అది చాలా విచిత్రమే.
భాజపా సిద్దాంతాల ప్రకారం ఒక వ్యక్తికి రెండు సార్లు కంటే మించి రాజ్యసభ సభ్యుడిగా నియమించకూడదు కానీ, వెంకయ్య నాయుడుకి మూడుసార్లు అవకాశం ఇచ్చారు కనుక ఈసారి ఆయనని కూడా పక్కన పెట్టాలని భాజపా నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయనను కూడా పార్టీ సేవకే ఉపయోగించుకోవచ్చని సమాచారం. ఆయన పార్టీకి చేసిన సేవలకు గౌరవంగా ఆయనను రాష్ట్రపతి చేయాలని భాజపా భావిస్తున్నట్లు ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజానిజాలు రాష్ట్రపతి ఎంపిక జరిగినప్పుడే తెలుస్తుంది. భాజపాలో వారిద్దరూ తప్ప మిగిలిన నలుగురికి మళ్ళీ రాజ్యసభ సీట్లు కేటాయించి మంత్రి పదవులలో కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక తెదేపా మంత్రుల విషయానికి వస్తే, ప్రత్యేకహోదా హామీపై మోడీ ప్రభుత్వం మాట తప్పిన కారణంగా సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజుల చేత రాజీనామా చేయించి కేంద్రానికి నిరసన తెలపాలని ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న కారణంగా వారిని ఇంకా ఆ పదవులలో కొనసాగించాలా వద్దా అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవలసి ఉంది. వారిని వెనక్కి తీసుకోవడం వలన కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం గురించి ఆలోచించేవారు, మాట్లాడేవారే ఉండరు కనుక వారిని కొనసాగించడం చాలా అవసరం. ఒకవేళ వారిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సుజనా చౌదరిని తప్పించినా ఆయన స్థానంలో తెదేపా తరపున వేరొకరిని కేంద్ర మంత్రిగా నియమించవచ్చు.