ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి కేంద్రప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగపరిచిందని ఘాటుగా విమర్శిస్తూ, రాష్ట్ర హైకోర్టు దానిని సస్పెండ్ చేయడంతో మోడీ ప్రభుత్వానికి చాలా అప్రదిష్ట కలిగించింది. దానిపై కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళగా మళ్ళీ స్టే మంజూరు చేసింది. అది వేరే సంగతి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆ సందర్భంగా మోడీ ప్రభుత్వం చేసిన అది చేసిన విమర్శలు కేంద్ర మంత్రులందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితులను కల్పించాయి. ఆ విధంగా ఇబ్బంది పడ్డ వారిలో వెంకయ్య నాయుడు కూడా ఒకరు. ఈ వ్యవహారం గురించి మీడియా ప్రతినిధులు ఆయనని ప్రశ్నించినపుడు ఆయన చాలా తెలివిగా జవాబు చెప్పారు.
“ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పడిన రాజ్యాంగ సంక్షోభం నివారించడానికే తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. అక్కడ నెలకొన్న పరిస్థితులు చక్కబడేవరకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం చేతనే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ అక్కడి శాసనసభను రద్దు చేయలేదనే సంగతి అందరూ గమనించాలి. శాసనసభలో విశ్వాస పరీక్ష జరిగేవరకు గవర్నరే పాలనా వ్యవహారాలు చూసుకొంటారు. అయినా 9 మంది ఎమ్మెల్యేలను ఏకపక్షంగా అనర్హులుగా ప్రకటించిన తరువాత హరీష్ రావత్ ఏవిధంగా మెజార్టీ నిరూపించుకోగలరు?మాకు చట్టం, రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకొంటాము,” అని అన్నారు.
పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకొంటున్న జమ్మూ కాశ్మీర్ వంటి అతిసున్నితమయిన రాష్ట్రంలో పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ, తన తండ్రి మరణాంతరం భాజపా మద్దతు ఇస్తామని ముందుకు వచ్చినా సుమారు నాలుగు నెలలపాటు ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా కూర్చొంటే కేంద్రప్రభుత్వం అక్కడ గవర్నర్ చేతనే పాలన కొనసాగించింది తప్ప రాష్ట్రపతి పాలన విదించలేదు. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాజపా ప్రోత్సాహంతో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పై తిరుగుబాటు చేయగానే, గవర్నర్ ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి హరీష్ రావత్ శాసనసభలో బలనిరూపణకు సిద్దం అవుతుంటే, కొన్ని గంటల ముందు హడావుడిగా రాష్ట్రపతి పాలన విధించింది. అప్పుడు అది తాత్కాలికంగా విధిస్తున్నట్లు చెప్పలేదు. కానీ ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసిన తరువాత తాత్కాలికంగా విదించమని వెంకయ్య నాయుడు నమ్మబలుకుతున్నారు. గవర్నర్ స్వయంగా హరీష్ రావత్ ని శాసనసభలో విశ్వాస పరీక్షని ఎదుర్కోమని చెప్పినపుడు, అందుకు ఆయన సిద్దమవుతున్నప్పుడు, ఇంకా తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించవలసిన అవసరం ఏమిటి? అని ఆలోచిస్తే వెంకయ్య నాయుడు ప్రజలను మభ్య పెట్టేందుకే ఆవిధంగా చెపుతున్నట్లు అర్ధమవుతుంది.