వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి చాలారోజులే అయింది. కానీ, ఇంకా భాజపా భావజాలానికి ఆయన దూరం కాలేకపోతున్నారనే అనిపిస్తోంది! క్రియాశీల రాజకీయాల్లో ఇకపై ఉండలేనూ ఉండనూ అని చెబూతూనే ఇంకా ఉంటున్నట్టుగానే మాట్లాడుతూ ఉండటం విశేషం. విజయవాడలో జరిగిన ఏపీ హైవే ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన వచ్చారు. కేంద్రమంత్రి నితిన్ గట్కరీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తనదైన శైలిలో ప్రసంగించారు! వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని తరగతులవారికీ తెలుగు భాష నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. మాతృభాష కన్ను లాంటిదనీ, ఇతర భాషలు కళ్ల జోడు లాంటివనీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుకోలేదనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలాంటి స్కూళ్లకు వెళ్లలేదనీ, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉప రాష్ట్రపతి స్థాయికి వచ్చానని వెంకయ్య చెప్పారు.
వెంకయ్య ప్రసంగం అనగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీపై పొగడ్తలు అనేవి కామన్ గా ఉండేవి కదా! ఉండేవీ కాదు.. ఇప్పుడూ ఉన్నాయిలెండి. నదుల అనుసంధానం గురించి మాట్లాడుతూ.. గోదావరిలో నీళ్లున్నాయి, కృష్ణానది ఎండిపోతే.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని పట్టిసీమ పూర్తి చేశారన్నారు. దాని ద్వారా గోదావరిలో నీటిని కృష్ణకు తెప్పించారనీ, ఇంతకంటే మరో ఉదాహరణ అవసరం లేదని వెంకయ్య చెప్పారు. ఇలానే దేశవ్యాప్తంగా నదులు అనుసంధానం జరిగితే దేశం సుభిక్షం అవుతుందని ఆకాంక్షించారు. గుజరాత్ లో కూడా నరేంద్ర మోడీ ఇలానే చేశారన్నారు. ఎక్కడో ఉన్న నర్మదా నీళ్లను ఉత్తర మెహసానాకి మళ్లించారని చెప్పారు. అహ్మదాబాద్ లో ఎండిపోయిన సబర్మతికి నర్మదా నీళ్లను రప్పించారని అన్నారు. తెలంగాణలో కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లను మళ్లిస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారని చెప్పారు. పోలవరం గురించి కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీసుకుంటున్న చొరవను చెప్పారు. ఆ ప్రాంతంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం అనేది చారిత్రక నిర్ణయం అన్నారు.
తనకు తరచూ ఇక్కడికి రావాలనీ అందర్నీ కలవాలని ఉంటుందని వెంకయ్య చెప్పారు. కానీ, ఇవాళ్ల ఆ పరిస్థితి లేదనీ, ‘చూస్తున్నారు కదా.. ఈ ప్రొటోకాల్, దీని వ్యవహారం, దీనికి ఉండాల్సిన సమస్యలు దీనికీ ఉన్నాయ’ని వెంకయ్య చెప్పడం గమనార్హం! అందువల్ల తరచూ వచ్చే అవకాశం లేదనీ, కానీ అవసరం ఉన్నప్పుడు చేయాల్సిన జోక్యం చేసుకుంటానని చెప్పారు. ఇదీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం తీరు! ఇంకా కేంద్రంలోని భాజపా సర్కారు తరఫునే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు కార్యదక్షతను ఏదో ఒక పాయింట్ దగ్గర గొప్పగా చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఉప రాష్ట్రపతి పదవి అనేది తన ముందరకాళ్లకు వేసిన బంధం అనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్టుగా ఇప్పటికీ మాట్లాడుతున్నారు! మొత్తానికి, వెంకయ్యలో ఇంకా భాజపా వదల్లేదనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వదిలించుకోవాల్సిన అవసరం లేదుగానీ, కనీసం ఆ పదవిలో ఉన్నంత కాలం తటస్తంగా ఉన్నట్టుగానైనా కనిపించాలి కదా!