రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోడీని కలవడంపై టిడిపి వైసీపీల మధ్య ఇంత రచ్చ జరుగుతుంటే తనదైన శైలిలో వ్యాఖ్యలు చేయాల్సిన వెంకయ్య ఏమయ్యారు? ఎందుకు మాట్లాడటం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతిసారీ ప్రత్యక్షమై ప్రవచనాలు చేసే సీనియర్ కేంద్ర మంత్రి తన ఇలాకాలో అంటే ఢిల్లీలోనే జగన్ భేటీ వంటివి జరిగినా ఎందుకు పాత్ర చూపించుకోవడం లేదు? ఇది ఆయనకు ఇష్టం లేకుండా తెలియకుండా జరిగిందా? లేక తెలిసి జరిగినా చంద్రబాబుకు భిన్నమైన వ్యూహం తమ పార్టీ చేపట్టింది గనక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.బిజెపిలో రెండు వర్గాలు తెలుగుదేశం పట్ల భిన్నస్వరాలు వినిపించడం పరిపాటి గాని జగన్ భేటీ విషయంలో మాత్రం కలిస్తే తప్పేమిటని వారంతా అంటున్నారు. అలా అనడం చంద్రబాబుకు నచ్చదు గనక మరోలా అంటే తమ వారికి నచ్చదు గనక వెంకయ్య మౌన ముద్ర దాల్చారా? లేకపోతే రేపో ఎల్లుండో తనదైన శైలిలో సూక్తి ముక్తావళితో ముందుకొస్తారా? ఏమో చూడాలి మరి!